Malla Reddy : కవిత సస్పెన్షన్ సరైనదే

మల్లారెడ్డి కవిత సస్పెన్షన్‌ను సమర్థించారు. కేసీఆర్‌కు పార్టీయే ముఖ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై డ్రామాలు చేస్తోందని విమర్శించారు.

Malla Reddy : కవిత సస్పెన్షన్ సరైనదే

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్(Kavitha Suspension) చేయడం సరైన నిర్ణయమేనని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం ద్వారా కేసీఆర్‌కు(KCR) కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు.. పార్టీయే ముఖ్యం అని చాటారన్నారు .దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని..ప్రతి కుటుంబంలో గొడవలు సహజం అన్నారు. అయితే కేసీఆర్ కు తెలంగాణ(Telangana) ప్రజలే ముఖ్యం అని..తన కుమార్తె, కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరన్నారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోంది అని మల్లారెడ్డి(Malla Reddy) విమర్శించారు. ఈ విషయంలో సీబీఐ మాత్రమే కాదు.. ఎవరూ ఏమీ చేయలేరన్నారు. సీబీఐ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి…యుగ పురుషుడు..తెలంగాణ నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టం అని వ్యాఖ్యానించారు.