VP Election 2025 | ఆత్మప్రబోధానుసారం ఓటేయండి.. ఎంపీలకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పిలుపు

రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలందరూ దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

VP Election 2025 | ఆత్మప్రబోధానుసారం ఓటేయండి.. ఎంపీలకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పిలుపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (విధాత):

VP Election 2025 | భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్‌ 9న పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి ఎంపీలను ఉద్దేశించి హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో వీడియో సందేశం విడుదల చేశారు. రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలందరూ ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని కోరారు. దేశహితాన్ని దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిపి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

ఏమిటీ ఆత్మప్రబోధం!

భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు మరికొన్ని ఎన్నికలకు విప్ వర్తించదు. అంటే, ఓటర్లుగా ఉండే వాళ్ళు తమ పార్టీ ఆదేశానికి కట్టుబడాల్సిన అవసరం లేకుండా.. తమ విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. ప్రతి సభ్యుడు తన మనసు, తన నిర్ణయం ప్రకారం ఓటు వేయడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. అందుకే ప్రస్తుతం జరుగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరుతున్నారు.

భారతదేశంలో ఆత్మ ప్రబోధం పనిచేసిన ఎన్నిక

సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మెజార్టీ ఎవరైతే కలిగి ఉంటారో, వాళ్ల పార్టీ అభ్యర్థి, లేదంటే బలపరిచిన అభ్యర్థి గెలవడం సహజం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో క్రాస్‌-వోటింగ్ లేదా పాలిటికల్ కాంప్లికేషన్స్ వల్ల అనుకోని ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1969 రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆత్మ ప్రబోధం స్వతంత్ర అభ్యర్థిని గెలిచేలా చేసింది. ఆ సమయంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికార పార్టీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి బరిలో ఉన్నారు. అయితే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆత్మ ప్రబోధం తో ఓటేయండి అంటూ తమ పార్టీ ఎంపీలకే పిలుపునిచ్చారు. దాంతో స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థి వీవీ గిరి రాష్ట్రపతిగా గెలిచారు. ఇప్పుడు కూడా దేశంలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులు నేపథ్యంలో కచ్చితంగా ఎంపీలంతా ఆత్మ ప్రబోధంతో ఓటేయాలంటూ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటూ, కాంగ్రెస్ పార్టీ నేతలు, నేతలు పిలుపునిస్తున్నారు.