Prashant Kishor | జన్ సురాజ్ పార్టీకే జనం మద్ధతు.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు( Bihar Assembly Elections ) షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ ( Jan Suraaj Party ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్( Prashant Kishor ) కీలక వ్యాఖ్యలు చేశారు.

Prashant Kishor | పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు( Bihar Assembly Elections ) షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్( Prashant Kishor ) కీలక వ్యాఖ్యలు చేశారు. జన్ సురాజ్ పార్టీ( Jan Suraaj Party )కే బీహార్ ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అక్టోబర్ 9వ తేదీన తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తానని చెప్పారు. తాను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే ఏ స్థానం నుంచి అనేది.. 9వ తేదీనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. తన స్థానం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా బ్లాక్ కూటమిలకు 72 శాతం ఓట్లు పోలయ్యాయని ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు. మిగిలిన 28 శాతం ఓట్లు ఇతర పార్టీలకు పడ్డాయని తెలిపారు. ఈ సారి ఆ 28 శాతం ఓట్లు తమకే పోల్ అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఏ, ఇండియా కూటమిలకు పోలైన ఓట్లలో 10 శాతం చొప్పున తమకు ఈసారి పోల్ అయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో కలిపి జన్ సురాజ్ పార్టీకి 48 శాతం ఓట్లు తప్పకుండా వస్తాయని ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు తమను విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇక ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రానికి నితీశ్ కుమార్ సీఎంగా ఉండకపోవచ్చు. బీహార్ సీఎం అధికారిక నివాసంలో ఆయన వచ్చే మకర సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించకపోవచ్చని జ్యోతిష్యం చెప్పారు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్ కోసం తమ తల్లిదండ్రులు ఓటేస్తారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.