ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో మంత్రుల ఆకస్మిక పర్యటన

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రుల పొన్నం ప్రభాకర్ ,వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో మంత్రుల ఆకస్మిక పర్యటన

హైదరాబాద్, సెప్టెంబర్7(విధాత): కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రుల పొన్నం ప్రభాకర్ ,వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పాఠశాల ఆవరణలో చెత్త చెదారం ఉండకుండా చూడాలని, పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. పాఠ్య ప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకోని విజయం దిశగా సాగాలని సూచించారు.

విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని , క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని గురుకుల సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు విద్యార్థులను, టీచర్లను సత్కరించారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన జి. సంధ్య రాణి, విద్యాదాన్ స్కాలర్ షిప్ అందుకున్న ఎస్. శ్రావణి, రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలకు ఎంపికైన ఎస్. మాధవి, అనిత లను సత్కరించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్ జె. శ్రీలత , విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు.

ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకుని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. ఈ క్రమంలో మంత్రి స్వయంగా డ్రాయింగ్ వేసి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. విద్యతో పాటు క్రీడలో, కళల్లో రాణించాలని సూచించారు.