విధాత, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొన్ని పెట్రోల్ బంకులు మూతపడిన నేపథ్యంలో.. పెట్రోల్ ఉన్న బంకుల్లో వాహనాల రద్దీ పెరిగిపోయింది. సైబరాబాద్ పీఎస్ బంకు వద్దకు వాహనాలు.. 2కిలోమీటర్ల మేర బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ వైపు మండుతున్న ఎండల మధ్య వాహనాలను బారులు నిలిపి పెట్రోల్, డీజిల్ కోసం ఎదురుచూపులు పడుతూ వాహనదారులు నానా తిప్పలు పడుతున్నారు. ఇంధన కొరత సమస్యను వీలైనంత త్వరగా తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి
నల్లగొండ జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బంకుల ఎదుట భారీగా క్యూ కట్టిన వినియోగదారులు…పెట్రోల్ డీజిల్ పోసేంతవరకు కదిలేది లేదంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు నలగొండ మహిళా జూనియర్ కళాశాల ఎదుట పెట్రోల్ బంక్ ముందు రోడ్డుపై ధర్నాకు దిగారు. పెట్రోల్, డీజిల్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టిస్తున్న బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికి బేఖాతరు చేస్తున్న బంకు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ప్రజలు మండిపడ్డారు. వాహనదారులు నిరసనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో పలు మండలాల్లో పెట్రోల్ బంక్ ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
సుప్రీంకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట వద్ద బోర్డుల తొలగింపు
అండర్‌గ్రాడ్యుయేట్స్‌కు నెరవేరని 5 లక్షల వార్షికవేతనం కల.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు
