సుప్రీంకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట వద్ద బోర్డుల తొలగింపు
బతుకమ్మ కుంట భూవివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, గ్రిల్స్ తొలగించారు. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
హైదరాబాద్ : బతుకమ్మ కుంట పునరుద్దరణ వివాదంలో హైడ్రాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివాదంలో ఉన్న భూమిలో అభివృద్ధి పనులు ఎలా చేశారని.. వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని లేదంటే జైలు తప్పదన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ బతుకమ్మ కుంట వద్ద ఉన్న బోర్డులు తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైడ్రా సిబ్బంది వెంటనే బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు, గ్రిల్స్ తొలగించారు.
వివాదంలో ఉండగానే అభివృద్ది పనులపై ధర్మాగ్రహం
బతుకమ్మ కుంట భూమి వివాదం కోర్టులో ఉండగానే..హైడ్రా సుందరీకరణ పనులు చేసి గ్రిల్స్, బోర్డులు ఏర్పాటు చేసింది. బాగ్‌అంబర్‌పేట్‌లోని సర్వే నంబరు 563/1లో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట తమదంటే తమదని, ఇది ప్రభుత్వ భూమి అని హైడ్రా, ఇది ప్రైవేట్ భూమి అని ఎడ్ల సుధాకర్ రెడ్డిలు కోర్టుల్లో పోరాడుతున్నారు. కోర్టులో వివాదం నడుస్తుండగానే.. హైడ్రా అక్కడ చిల్డ్రన్ పార్కులు, ఓపెన్ జిమ్, బోర్డులు ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు గతంలో తప్పుపట్టింది. వెంటనే హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించకపోతే జైలు తప్పదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పనులపై స్టేటస్ కో విధించింది.హైకోర్టు ఆదేశాలను హైడ్రా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని, 4 వారాల్లో అఫిడవిట్ దాఖలుచేయాలని ఆదేశించింది. ఇతర అంశాలపై తదుపరి విచారణలో స్పష్టత ఇస్తామని చెబుతూ విచారణను మే నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్‌దత్త, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది. కంచె తొలగింపు సహా ఇతరత్రా విషయాల్లో ఏమైనా ఇబ్బందులుంటే ఆ వివరాలను అఫిడవిట్ లో పొందుపరచాలని స్పష్టం చేసింది.
మాజీ ఎంపీ వీహెచ్ నిరసన
అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట భూవివాదం విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు (వీహెచ్) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బతుకమ్మ కుంట వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ న్యాయ వ్యవస్థ పనితీరుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎవరైనా ఏమైనా అనొచ్చు, కానీ జడ్జీలను ఒక్క మాట అంటే చాలు.. తెల్లవారేసరికి నోటీసులు పంపుతారని అన్నారు. న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలని స్పష్టం చేశారు. హాజీపూర్ లాంటి ఘోరమైన కేసుల్లో ఆరేళ్లు గడిచినా బాధితులకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, కానీ బతుకమ్మ కుంట విషయంలో కోర్టు ఇంత వేగంగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన విమర్శించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బతుకమ్మ కుంట వద్ద బోర్డులను, శిలాఫలకాలను తొలగించిన హైడ్రా https://t.co/PjHEmmQgY0 pic.twitter.com/Dne1CF6tmA
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2026
ఇవి కూడా చదవండి :
అండర్‌గ్రాడ్యుయేట్స్‌కు నెరవేరని 5 లక్షల వార్షికవేతనం కల.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు
రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram