తెలంగాణ, ఏపీల్లో ఊపందుకున్న నామినేషన్ల సందడి

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. తెలంగాణలో శుక్రవారం ఎంపీ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు.

  • Publish Date - April 19, 2024 / 08:13 PM IST

రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

విధాత : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. తెలంగాణలో శుక్రవారం ఎంపీ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి భారీ ర్యాలీతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలిసి తన నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్‌, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌, ఖమ్మంలో వినోద్‌రావులు తమ నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధిగా అసదుద్దీన్ ఒవైసీ, నాగర్ కర్నూల్ బీఆరెస్‌ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, బీఆరెస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌, నిజామాబాద్ బీఆరెస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌, భువనగిరిలో సీపీఎం అభ్యర్థి ఎండి.జహంగీర్, నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 98నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏపీలో ప్రముఖుల నామినేషన్ల దాఖలు
ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు పార్టీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరిలు నామినేషన్ దాఖలు చేశారు. వారి నామినేషన్ల ర్యాలీలో టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు సైకిల్‌పై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని నామినేషన్ వేశారు.

వైసీపీ పార్టీ నుంచి మంగళగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, దెందులూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా అబ్బాయి చౌదరి, నర్సాపురం వైసీపీ అభ్యర్థి ముదునూరు ప్రసాద్ రాజు, అచంటలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు, భీమవరంలో గంధి శ్రీనివాస్, ఎలమంచిలి అభ్యర్థిగా జీవి రమణ మూర్తి రాజు, చీపురుపల్లి అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ, నగరి అభ్యర్థిగా మంత్రి ఆర్కే రోజా, పత్తిపాడు అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు, తణుకు వైసీపీ అభ్యర్థిగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు.
కాకినాడలో టీడీపీ అభ్యర్థిగా కొండా బాబు, కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ, తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా జయచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, కొండపి టీడీపీ అభ్యర్థిగా డోలా బాలవీరాంజనేయ స్వామి, యర్రగొండపాలెంలో టీడీపీ నుంచి గూడూరు ఎరిక్సన్, కావలిలో టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు గ్రామీణం టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ తరుపున సతీమణి అనూరాధ, గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల ముఖ్య నాయకులు నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు హాజరయ్యారు.

Latest News