విధాత : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-election)తో పాటు బీహార్ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల(Bihar Assembly Elections) ప్రచారం ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్‌ఎంఎస్‌లు, ఆడియో మెసేజ్‌లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 తర్వాత 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు బీహార్ లో రెండో విడతలో 123 అసెంబ్లీ స్థానాలకునవంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 1302మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..3.7కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు రెండు విడతల్లో(నవంబర్ 6, 11) పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తొలివిడతగా బీహార్ లో 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6న పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుతో పాటు బీహార్ లో నవంబర్ 14వ తేదీన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 55మంది అభ్యర్థులు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలో ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీచేస్తుండగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని 4,01,365 మంది ఓటర్లు ఈ నెల 11న జరిగే పోలింగ్ లో తేల్చనున్నారు. ఉపఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 226 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
