బీఆరెస్‌కు దక్కని ప్రాతినిధ్యం… ఒక్కటీ గెలవని మాజీ అధికార పార్టీ

చెరో 8 సీట్లలో కాంగ్రెస్‌, బీజేపీ గెలుపు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ కనిష్ఠంగా 9 నుంచి 12 సీట్లలో గెలుస్తుందని పలువురు అంచనా వేసినప్పటికీ.. 8 సీట్లకు పరిమితమైంది. మరోవైపు బీజేపీ పుంజుకొని తన బలాన్ని ఎనిమిదికి పెంచుకున్నది. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకున్నది. పదేళ్లు అధికారంలో ఉండి.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆరెస్‌.. ఒక్క స్థానంలోనూ గెలవలేక చతికిలపడింది.

  • Publish Date - June 4, 2024 / 08:10 PM IST

బీజేపీకి వచ్చిన సీట్లన్నీ కారు చలవే?

విధాత‌:లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ కనిష్ఠంగా 9 నుంచి 12 సీట్లలో గెలుస్తుందని పలువురు అంచనా వేసినప్పటికీ.. 8 సీట్లకు పరిమితమైంది. మరోవైపు బీజేపీ పుంజుకొని తన బలాన్ని ఎనిమిదికి పెంచుకున్నది. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకున్నది. పదేళ్లు అధికారంలో ఉండి.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆరెస్‌.. ఒక్క స్థానంలోనూ గెలవలేక చతికిలపడింది. 24 ఏళ్ల త‌రువాత మొద‌టిసారిగా లోక్‌సభలో బీఆరెస్‌కు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ మిన‌హా మిగిలిన చోట్ల మూడ‌వ స్థానానికే ప‌రిమిత‌మైంది. హైద‌రాబాద్ పార్లమెంటు స్థానంలో నాలుగ‌వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజ‌క వ‌ర్గాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచాయి. కాంగ్రెస్ గెలిచిన 8 నియోజ‌క‌వ‌ర్గాల‌లో బీజేపీ 5 స్థానాల్లో రెండ‌వ స్థానంలో నిలువ‌గా బీఆరెస్ 2 నియోజ‌క‌వ‌ర్గాల‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం వ‌ర‌కు ఓట్లు రాగా బీజేపీకి 36 శాతం వ‌ర‌కు ఓట్లు వ‌చ్చాయి. కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ గెలిచింది.

సీఎం రేవంత్ ఇలాకాలో బీజేపీ పాగా..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మ‌ల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈట‌ల రాజేంద‌ర్ గెలిచారు. అలాగే సీఎం సొంత‌ జిల్లా వికారాబాద్ ఉన్నచేవెళ్ల నియోజ‌క వ‌ర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేవంత్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉన్న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. ఇలా మ‌ల్కాజిగిరి, చేవెళ్ల, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్లమెంటు నియోజకవ‌ర్గాలు సీఎం రేవంత్‌రెడ్డికి వ్యక్తిగ‌తంగా అత్యంత ప్రతిష్ఠాత్మక‌మైన‌వి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గాలుగా భావిస్తున్న మ‌ల్కాజిగిరి, చేవెళ్ల, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ల‌లో బీజేపీ గెలువ‌డం రాజ‌కీయంగా రేవంత్‌కు పెద్ద దెబ్బేనన్న చర్యల రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌రిధ‌లోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ గెలువ‌డం పెద్ద చ‌ర్చనీయంశ‌మైంది.

బీజేపీ బ‌లం బీఆరెస్‌దేనా?

లోక్‌సభ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌డిన ఓట్లన్నీ బీఆరెస్‌వేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ‌లో తనకు ప్రతిపక్షమే ఉండకూడదన్న రీతిలో ఆనాడు కేసీఆర్‌ వ్యవహరించడంతో కాంగ్రెస్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. కానీ.. ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేసింది. ఇప్పుడు అదే బీజేపీ.. తాను ఎదగడానికి కారణమైన బీఆరెస్‌ను బలితీసుకున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత బీఆరెస్ నేత‌లు ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. ఇక్కడ ఉంటే లాభం లేద‌ని భావించి, కాంగ్రెస్‌, బీజేపీల‌లో చేరారు. చివ‌ర‌కు పోటీ చేయ‌డానికి కూడా అభ్యర్థుల‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి బీఆరెస్ కు ఏర్పడింది. పార్లమెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయ‌లేని బీఆరెస్ క్యాడ‌ర్ బీజేపీకి ఓట్లు వేశార‌ని, అందుకే బీఆరెస్ మూడ‌వ స్థానానికి పరిమిత‌మైంద‌న్నఅభిప్రాయం స‌ర్వత్రా వ్యక్తం అవుతోంది.

Latest News