మనం 156 ఏళ్లు బతకగలమా? అమరత్వం సాధ్యమేనా? శాస్త్రవేత్తల అధ్యయంలో సంచలన విషయాలు!

మనిషి డెబ్బై ఏళ్లకో 80 ఏళ్లకో.. మహా అయితే 90 ఏళ్ల తర్వాతో ఎందుకు చనిపోవాలి? అసలు మనిషి పూర్తి ఆరోగ్యంతో ఉంటే ఎన్నేళ్లు బతకగలడు? అలా బతకాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి? అసలు మనిషికి అమరత్వం సాధ్యమేనా? శాస్త్రవేత్తల అధ్యయనంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన పరిశోధనను npj Aging జర్నల్‌లో ప్రచురించారు.

Maximum human lifespan study ai generated image

మనిషి ఆయుర్దాయాన్ని పెంచేందుకు, వృద్ధాప్యాన్ని జాప్యం చేసేందుకు అనేక పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో శాస్త్రవేత్తలు మనిషి గరిష్ఠంగా ఎంతకాలం బతుకుతాడు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మానవుల్లో వృద్ధాప్యానికి అనేక అంశాలు కారణమవుతూ ఉంటాయి. ఈ మార్పులు అన్నింటినీ నిలువరించగలిగితే.. గరిష్ఠంగా 156 ఏళ్ల వరకూ బతికేందుకు అవకాశం ఉందని, ఆ తర్వాత జీవించడం కష్టమేనని తేల్చారు. ఈ పరిశోధనను npj Aging జర్నల్‌ ప్రచురించింది.

అదే మనిషి జీవితకాలానికి హద్దు?

వృద్ధాప్యాన్ని విశ్లేషించేందుకు పరిశోధకులు ఒక మేథమెటికల్‌ మోడల్‌ను అనుసరించారు. ఇందులో మనిషి వృద్ధాప్యానికి కారణమయ్యే ఒక్కో ప్రక్రియను తొలగిస్తూ పోయారు. చివరకు సోమాటిక్‌ మ్యుటేషన్స్‌ మిగిలే వరకు పరిశీలించి.. మనిషి ఎంతకాలం జీవిస్తాడనే అంశాన్ని లెక్కగట్టారు. మన శరీరంలోని సాధారణ కణాలు.. అంటే బ్లడ్‌ సెల్స్‌లో జీవితకాలంలో జన్యుపరంగా కలిగే మార్పులనే సోమాటిక్‌ మ్యుటేషన్స్‌ అంటారు. ఇవి మన చర్మం, లివర్‌, ఊపిరితిత్తులు, రక్తం వంటి అవయవాల కణాల్లో జరిగే మార్పులన్నమాట. అలా సోమాటిక్‌ మ్యుటేషన్స్‌ మినహా ఇతర వృద్ధాప్య కారకాలను పూర్తిగా నియంత్రిస్తే.. సగటున గరిష్ఠ జీవితకాలం 146 ఏళ్ల నుంచి 194 ఏళ్లదాకా ఉండొచ్చని లెక్కగట్టారు. దాని సగటుతో మధ్యస్థ జీవితకాలం (Median Lifespan) సుమారు 156 ఏళ్లుగా నిర్ధారించారు. ఎంత ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా.. ఎంత గొప్ప యాంటిఏజింగ్‌ చికిత్సలు పుట్టుకొచ్చినా మనిషి జీవితానికి 156 ఏళ్లు ఫైనల్‌ అని తేల్చారు.

అసలు సమస్యలు అవే…

మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలు మెదడు, గుండె. ఈ రెండింటిలోని ముఖ్యమైన కణాలు జీవితకాలంలో దాదాపు కొత్తవి తయారయ్యే అవకాశాలు లేవు. కాలక్రమేణా వాటిలో సోమాటిక్‌ మ్యుటేషన్స్‌ పేరుకుపోతూ ఉంటాయి. ఇప్పటికైతే వాటిని పూర్తిగా తొలగించే ఎలాంటి చికిత్సలూ అందుబాటులో లేవు. న్యూరాన్లు, గుండె కణాలే మనిషి జీవితకాలానికి అసలైన పరిమితిని నిర్ణయిస్తున్నాయని అధ్యయన సహ రచయిత ఎవ్‌గెనీ ఎఫిమోవ్‌ చెప్పారు.

వేల ఏళ్లు నిలిచే కాలేయం?

కొన్ని అవయవాల్లో కణాలు నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉంటాయి. అలాంటివాటిలో కాలేయం కూడా ఒకటి. అందువల్ల అక్కడ చోటు చేసుకునే జన్యుపరమైన మార్పులను శరీరం కొంత వరకూ భర్తీ చేసుకోగలుగుతుంది. సిద్ధాంతపరంగా అటువంటి అవయవాలు వేల ఏళ్లపాటు పనిచేసే అవకాశం ఉంటుందని పరిశోధకులు మోడల్‌ పేర్కొంటున్నది. కానీ.. మెదడు, గుండె విషయంలో పూర్తి భిన్నంగా ఉంటుంది. వీటి కణాలు ఒకసారి దెబ్బతింటే.. దాని వల్ల కలిగే నష్టం శాశ్వతంగా మారిపోతుంది. అదే చివరకు జీవితాన్ని ముగిస్తుంది.

అసలు ముసలితనమే లేకపోతే?

ఈ అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు మరో ఊహాజనిత స్థితిని కూడా పరిశీలించారు. అసలు మనిషికి వృద్ధాప్యమే లేకపోతే సగటు జీవితకాలం 1759 ఏళ్లు ఉంటుందని ఈ అధ్యయనంలో పాటించిన గణిత నమూనా వెల్లడించింది. కానీ.. దీనికి సోమాటిక్‌ మ్యుటేషన్స్‌ను చేర్చగా.. జీవితకాలం ఒక్కసారిగా 156 సంవత్సరాలకు తగ్గిపోయింది. దానిని బట్టి మనిషి గరిష్ఠ జీవితకాలం 156 ఏళ్లుగా అంచనాకు వచ్చారు.

దేవతలకు తరహా అమరత్వం మనుషులకు సాధ్యమేనా?

పురాణ కథల్లో దేవతలకు మరణం లేదని వింటూ ఉంటాం. మరి మనిషికి కూడా అది సాధ్యమేనా? వాస్తవానికి వృద్ధాప్య లక్షణాలను కొంత వరకూ తగ్గించేందుకు ప్రస్తుతం కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. సోమాటిక్‌ మ్యుటేషన్స్‌ను కంప్లీట్‌గా కంట్రోల్‌ చేయగలిగే టెక్నాలజీ, మెడికేషన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. వృద్ధాప్యానికి దారి తీసే మరిన్ని జీవశాస్త్ర కారకాలను సైతం రానున్న రోజుల్లో తమ మేథమెటికల్‌ మోడల్స్‌లో చేర్చి మరింత పరిశోధిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవన్నీ ఫలించి.. వాటిని అనుసరించేందుకు తగిన మార్గాలు లభిస్తే మనిషి చిరంజీవి అవుతాడా? ఏమో మరి వేచి చూడాల్సిందే.

Latest News