Realme P4R | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లోకి మరో కొత్త 5జీ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Realme P4R 5G పేరుతో తీసుకొస్తున్న ఈ మొబైల్‌ను జూన్ 10వ తేదీన ఆవిష్కరించనుంది. శక్తివంతమైన బ్యాటరీ, అధిక రీఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
జూన్ 10న లాంచ్!
రియల్‌మీ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. P4R 5జీ మొబైల్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఇక ఇది మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. Lavender Glare, Silver Glare, Titanium Glare రంగుల్లో ఈ మొబైల్ వస్తుంది. ఇక ఈ మొబైల్ ధర ఎంతనేది లాంచింగ్ రోజే తెలియనుంది.
బ్యాటరీనే మెయిన్ హైలైట్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీనే ప్రధాన హైలైట్‌గా చెప్పొచ్చు. ఇందులో 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని రియల్‌మీ కంపెనీ వెల్లడించింది. గేమింగ్ ప్రియులకు ఈ మొబైల్ ఎంతో ఉపయోగకరమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఈ మొబైల్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే Free Fire గేమ్‌ను 12.5 గంటల పాటు ఆడవచ్చని రియల్‌మీ కంపెనీ తెలిపింది. అదే యూట్యూబ్ వీడియోలను 21.6 గంటల వరకు వీక్షించవచ్చని పేర్కొంది. మ్యూజిక్ అయితే 6.5 రోజుల వరకు, మ్యాప్ నావిగేషన్‌ను దాదాపు 26.9 గంటల వరకు ఉపయోగించచ్చని చెప్పింది. అంతేకాకుండా ఈ మొబైల్ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుండటంతో తక్కువ సమయంలోనే ఫోన్‌ను చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
డిస్‌ప్లే – పనితీరు
పర్ఫార్మెన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందిస్తున్నారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ చిప్‌సెట్ రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, సాధారణ గేమింగ్‌కు మెరుగైన పనితీరు అందించనుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0 ఇంటర్‌ఫేస్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్ కనీసం 256జీబీ స్టోరేజ్‌తో వస్తుండగా.. 14జీబీ వరకు డైనమిక్ ర్యాప్ సపోర్టు ఇస్తుంది.
గేమింగ్ ప్రియులకు హీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
డిస్‌ప్లే పరంగా ఫ్లాట్‌స్క్రీన్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో గరిష్టంగా 144Hz రీఫ్రెష్ రేట్ ఉండనుందని తెలుస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలోనూ డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హీట్ మేనేజ్‌మెంట్ కోసం ఇందులో ప్రత్యేకంగా 5300 చదరపు మిల్లీమీటర్ల హీట్ డిసిపేషన్ ఏరియాతో కూడిన వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. దీనివల్ల ఎక్కువసేపు గేమ్స్ ఆడినా కూడా మొబైల్ వేడెక్కకుండా ఉండే అవకాశం ఉంది.
కెమెరా ఫీచర్లు
కెమెరా విషయానికి వస్తే P4R 5G మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఏఐ ప్రధాన కెమెరా ఇవ్వనున్నారు. అదనంగా ఫోన్ వెనుక భాగంలో ఏఐ పల్స్ లైట్ ఫీచర్ కూడా ఉంటుంది. దీనిని 9 రంగులు, 5 స్పీడ్ సెట్టింగ్‌లతో కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది.
డిజైన్‌పరంగా ఈ ఫోన్‌లో 8.8 మిల్లీమీటర్ల మందంతో స్లిమ్‌గా ఉండనుంది. IP65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు MIL STD 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా అందిస్తున్నారు. దీంతో కఠిన పరిస్థితుల్లోనూ ఈ ఫోన్ మన్నికగా ఉండే అవకాశం ఉంది.
