Self Driving Truck | హైవేలపై సరికొత్త విప్లవం.. డ్రైవర్లు లేకుండా ఏఐతో రోడ్లపై పరుగులు పెట్టే ట్రక్కులు.. వీటితో లాభమా? నష్టమా?
డ్రైవర్ లేకుండానే హైవేలపై పరుగులు తీసే సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులు రాబోతున్నాయి. మనుషుల అవసరం లేకుండా ట్రక్కులను నడిపే ఏఐ టెక్నాలజీని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కు చెందిన వేమోతో పాటు పలు అమెరికన్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇవి రోడ్లపైకి రావడానికి ఉన్న సవాళ్లేంటి? వీటితో లాభమా? నష్టమా? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Self Driving Truck | ఒక్కసారి ఊహించండి..! అర్ధరాత్రి హైవేపై దూసుకుపోతున్న భారీ ట్రక్. ముందు సీట్లో డ్రైవర్ లేడు.. చేతిలో స్టీరింగ్ పట్టుకున్న నిద్రమత్తులో కళ్లు చెదిరే వ్యక్తి లేడు.. అయినప్పటికీ రహదారిపై మలుపులు, ఇతర వాహనాల వేగం, వర్షం, పొగమంచు అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ గమ్యస్థానానికి వెళ్తుంది. వినడానికి ఇది హాలీవుడ్ సినిమా స్టోరీలా అనిపించినప్పటికీ.. ఇది భవిష్యత్తులో ట్రాన్స్‌పోర్ట్ రంగంలో రాబోతున్న నిశ్శబ్ధ విప్లవం! సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల యుగానికి సంకేతం!!
సుదీర ప్రాంతాలకు ట్రక్‌లను నడిపినప్పుడు మనుషులకు అలసట రావడం సహజం. నిద్ర, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటివల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. భారీ ట్రక్కులతో జరిగే ప్రమాదాల్లో మానవ తప్పిదాలే ప్రధాన కారణమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తే ప్రమాదాలను నియంత్రించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల తయారీపై దృష్టి సారించారు. ఇప్పటికే అమెరికా, యూరప్, చైనా వంటి దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల టెక్నాలజీపై పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా డ్రైవర్ లేని ట్రక్కుల ద్వారా సరుకు రవాణా చేయిస్తున్నారు.

ట్రక్కును నడిపేది ఎవరు?
సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కు అంటే కేవలం ఆటోమేటిక్ వాహనం మాత్రమే కాదు.. అది ఒక కదిలే కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రక్ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించేందుకు కెమెరాలు, సెన్సర్లు, రాడార్, జీపీఎస్, లిడార్, మెషిన్ లెర్నింగ్ వంటి పలు టెక్నాలజీలు అన్నీ పనిచేస్తాయి. అలా వాటి నుంచి వచ్చిన సంకేతాలను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విశ్లేషిస్తుంది. దాని ద్వారా రోడ్డుపై పరిస్థితులకు అనుగుణంగా సొంత నిర్ణయాలనున తీసుకుంటుంది. ఉదాహరణకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్ వెళ్తున్నప్పుడు రోడ్డుపై ముందు ఉన్న వాహనం వేగం తగ్గించడం లేదా ఏదైనా జంతువు అకస్మాత్తుగా అడ్డం వచ్చిందని అనుకుందాం. అప్పుడు సడెన్ బ్రేక్ వేయాలా? పక్క లేన్‌కు మారాలా? వంటి నిర్ణయాలను ఏఐ సాయంతో నిర్ణయిస్తుంది. అంటే అచ్చం మనిషి ఎలా నిర్ణయాలు తీసుకుంటాడో ఈ కంప్యూటర్ కూడా అలాగే నిర్ణయం తీసుకుంటుంది.

ఎవరు తయారు చేస్తున్నారు?
సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులంటే చాలామంది కొత్తగా ప్రత్యేక ట్రక్కులను తయారు చేస్తారని అనుకుంటారు. కానీ నిజానికి ట్రక్కును ఒక కంపెనీ తయారుచేస్తే.. దాన్ని డ్రైవర్ లేకుండా నడిపించే టెక్నాలజీని మరో కంపెనీ తయారు చేస్తుంది. అంటే ఇంజిన్, బాడీ, టైర్లు, ఇతరత్రా విడిభాగాలు ఒక సంస్థవి అయితే.. ట్రక్‌ను నడిపించే డిజిటల్ డ్రైవర్ మరో సంస్థ రూపొందింది.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీపై ప్రయోగాల్లో అమెరికాకు చెందిన పలు కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో తొలిసారి సెల్ఫ్ డ్రైవింగ్‌పై దృష్టిసారించింది మాత్రం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో(Waymo). ఈ కంపెనీ స్వయంగా ట్రక్కులను తయారు చేయలేదు. కానీ ట్రక్‌ను డ్రైవర్ లేకుండా నడిపించే సాఫ్ట్‌వేర్, సెన్సర్ సిస్టమ్, ఏఐ టెక్నాలజీని అభివృద్ది చేసింది. దీని సాయంతో అమెరికాలోని టెక్సాస్, ఆరిజోనా ప్రాంతాల్లో భారీ ట్రక్కులతో సరుకు రవాణా ప్రయోగాలు కూడా నిర్వహించింది.
వేమోతో పాటు టెస్లా, కొడియాక్, ఆరోరా, గాటిక్, టోర్ఖ్, ఉబెర్, హోండా వంటి కంపెనీలు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల తయారీలో పోటీ పడుతున్నాయి. అయితే కొడియాక్ కంపెనీ ముందంజలో ఉంది. అమెరికాలో పరిమిత స్థాయిలో సరుకు రవాణా ప్రయోగాలను ప్రారంభించింది. కంపెనీల మధ్య ఉన్న ఈ పోటీ కారణంగా వచ్చే పదేళ్లలోనే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులు రోడ్ల మీద పరుగులు తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
యుద్ధభూమి నుంచి మొదలు..
సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల ఆలోచన ఇదే కొత్తదేమీ కాదు.. 1990లోనే యుద్ధ భూముల్లో సైనిక వాహనాల కాన్వాయ్ కోసం తొలిసారిగా ఈ ఆలోచన వచ్చింది. యుద్ధ ప్రాంతాల్లో ముందు ఉన్న ఒక ట్రక్కును మనిషి నడిపితే.. మిగిలిన ట్రక్కులు ఆటోమేటిక్‌గా దాని వెనుక అనుసరించి వెళ్లేలా పరిశోధనలు జరిగాయి. తర్వాత గనుల్లో ప్రమాదకర ప్రాంతాల్లో మనుషుల అవసరం లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేలా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు అదే సాంకేతికత హైవేపై వెళ్లే ట్రక్కుల వరకు చేరుకుంది.

ట్రక్కు డ్రైవర్ల పరిస్థితి ఏంటి?
సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులు వస్తే ప్రమాదాలు నియంత్రించవచ్చు.. సరే.. మరి ప్రపంచవ్యాప్తంగా ట్రక్ డ్రైవింగ్‌పై ఆధారపడి బతుకుతున్న డ్రైవర్ల పరిస్థితి ఏంటనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. అమెరికాలో సుమారు 20 లక్షలకు పైగా డ్రైవర్లు ఉన్నారని అంచనా. భారత్‌లో కూడా లక్షలాది కుటుంబాలు ట్రక్కులు, లారీల డ్రైవింగ్‌పైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఇలాంటి సమయంలో డ్రైవర్ లేకుండా ట్రక్కులు నడిస్తే వాళ్లంతా రోడ్డుపై పడాల్సిందేనా అనే భయాందోళనలు మొదలయ్యాయి. అయితే వాటిని నిపుణులు మాత్రం భిన్నంగా సమాధానమిస్తున్నారు. పూర్తిగా ఉద్యోగాలు పోవు.. కానీ వాటి స్వరూపం మారవచ్చని చెబుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దూర ప్రయాణాలకు ఆటోమేటిక్ ట్రక్కులు వస్తే స్టార్టింగ్ పాయింట్ నుంచి గమ్యస్థానం వరకు అవే వెళ్తాయి. కానీ లోడింగ్, అన్‌లోడింగ్ సమయంలో మనుషుల అవసరం ఉంటుంది. అలాగే రిమోట్ కంట్రోల్ ఆపరేటర్లు, సాఫ్ట్‌వేర్ మానిటరింగ్, సెన్సర్ మెయింటెనెన్స్, డేటా విశ్లేషణ వంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి సంప్రదాయ డ్రైవర్లు వాటికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
రోడ్డు పక్కన దాబాలు, టీ స్టాల్‌లు మాయం?
సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల ప్రభావంతో కేవలం డ్రైవర్ల జీవితాలే కాదు.. హైవేల వెంట బతికే ఎన్నో కుటుంబాలు ఆగమవుతాయి. జాతీయ రహదారుల పక్కన ఉండే దాబాలు, టీ స్టాళ్లు, మెకానిక్ షాపులు, చిన్న లాడ్జీలు, పార్కింగ్ యార్డులు అన్నీ ప్రధానంగా లారీలు, ట్రక్కు డ్రైవర్లపైనే ఆధారపడతాయి. ఒకవేళ మానవ డ్రైవర్ లేకుండా ఆటోమేటిక్‌గా ఆగకుండా ప్రయాణిస్తే.. ఈ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

సవాళ్లు ఎన్నో..!
సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ పూర్తిగా సిద్ధమైనప్పటికీ రోడ్లపై ప్రయాణించేటప్పుడు అనేక సవాళ్లు ఉంటాయి. ఉదాహరణకు ఆకస్మికంగా ఏదైనా రోడ్డును మూసివేసినా, ట్రాఫిక్ డైవర్ట్ చేసినా.. హైవేపై పెద్ద ప్రమాదం జరిగి ట్రాఫిక్ స్తంభించినా.. ఈ టెక్నాలజీ ఎలా స్పందిస్తుందో తెలియదు. మార్గమధ్యలో ట్రక్‌లో సాంకేతిక లోపం వచ్చి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు ఉన్నాయి. అందుకే చాలా దేశాలు ఈ సెల్ప్ డ్రైవింగ్ ట్రక్‌లకు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే తప్పనిసరిగా మానవ డ్రైవర్ ఉండాల్సిందేనని నిబంధనలు పెడుతున్నాయి.
భారత్‌లో సాధ్యమేనా?
విదేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ రహదారులపై వాహనాల క్రమశిక్షణ తక్కువగా ఉంటుంది. అలాగే హైవేలపై జంతువులు సడెన్‌గా రోడ్లు దాటుతుంటాయి. ఇలాంటి సవాళ్ల మధ్య రోడ్ల మీదకు ఈ ట్రక్కులు రావడం సవాళ్లతో కూడుకున్నదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే పోర్టులు, గనులు, పారిశ్రామిక కారిడార్‌లు, ప్రత్యేక లాజిస్టిక్ జోన్లలో మాత్రం వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Read More:
స్పోర్టీ లుక్.. ప్రీమియం ఫీచర్లతో కొత్త బజాజ్ పల్సర్ N160 లాంచ్.. ధర ఎంతంటే..!
మరింత ప్రీమియం లుక్‌లో 2026 టాటా టియాగో ఈవీ.. కీలక మార్పులివే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram