గుజ‌రాత్ విల‌విల – ఢిల్లీ మిల‌మిల‌

ఢిల్లీ ఎట్ట‌కేల‌కు జూలు విదిల్చి గుజ‌రాతీల ప‌నిప‌ట్టింది. కెప్టెన్ పంత్ 16 ప‌రుగుల‌తోనూ, సుమిత్‌కుమార్ 9 ప‌రుగుల‌తో నాటౌట్‌గా మిగిలి 8.5 ఓవ‌ర్ల‌లో 92 ప‌రుగుల‌తో ప‌ని పూర్తిచేసారు.

  • Publish Date - April 17, 2024 / 11:56 PM IST

ఐపిఎల్‌-2024లో భాగంగా ఆహ్మ‌దాబాద్ న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో గుజ‌రాత్ జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఢిల్లీ బౌలింగ్ ధాటికి ఒక‌రి వెనుక మ‌రొక‌రు క్యూ క‌ట్ట‌డంలో గుజ‌రాత్ బ్యాట‌ర్లు పోటీప‌డ్డారు. ఢిల్లీ అరివీర‌భ‌యంకరంగా బౌలింగ్ వేయడంతో పాటు పిచ్ కూడా స‌హ‌క‌రించ‌డంతో గుజ‌రాత్ క‌కావిక‌లం అయింది. రెండు అంకెల స్కోరు చేసింది కేవ‌లం ముగ్గురే కావ‌డం విశేషం. ఎట్ట‌కేల‌కు 89 ప‌రుగులు చేసి మ‌మ అనిపించింది. ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్‌కు ఇదే అత్య‌ల్ప స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఢిల్లీ 8.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది.

అంత‌కుముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ ధాటికి గుజ‌రాత్ టైటాన్స్ బెంబేలెత్తింది. పాయింట్ల ప‌ట్టికలో కిందినుండి రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ఎట్ట‌కేల‌కు జూలు విదిల్చి గుజ‌రాతీల ప‌నిప‌ట్టింది. టాస్ గెలిచి రెండో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ రిష‌బ్‌పంత్ స‌రైన నిర్ణ‌య‌మే తీసుకున్నాడ‌ని గుజ‌రాత్ బ్యాటింగ్ రుజువు చేసింది. 11 ప‌రుగుల‌కు మొద‌టి వికెట్‌గా కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ వెనుదిర‌గ‌గా, వ‌చ్చిన‌వారంద‌రూ మెల్ల‌గా కెప్టెన్ బాటే ప‌ట్టారు. 30 ప‌రుగుల‌కే 4 కీల‌క వికెట్లు చేజారాక‌, ఇక మ్యాచ్ మ‌ళ్లీ వాళ్ల చేతికి రాలేదు. ఒక్క ర‌షీద్ ఖాన్ మాత్ర‌మే కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి 31 ప‌రుగులు చేసాడు. చివ‌రికి 17.3 ఓవ‌ర్ల‌లో 89 ప‌రుగుల‌కు గుజ‌రాత్ చాప‌చుట్టేసింది. ఇదే గుజ‌రాత్‌కు ఈ సీజన్‌లో అత్య‌ల్ప స్కోర్‌. పోయినేడాది చేసిన 125 ప‌రుగులు అత్య‌ల్పం కాగా, అది కూడా ఇదే మైదానంలో, ఇదే ఢిల్లీతోనే కావ‌డం విశేషం.
ఢిల్లీ నెట్ ర‌న్‌రేట్‌ను పెంచుకోవాల‌నే ఆత్ర‌త‌లో ధాటిగానే ఆరంభించిన‌ప్ప‌టికీ, క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కూడా చేజార్చుకుంది. ఓపెన‌ర్ పృథ్వీషా (7) ప‌రుగుల‌కే అవుట‌యిన‌ప్ప‌టికీ, జాక్ ఫ్రేజ‌ర్‌(20), అభిషేక్ పొరెల్ (15), షాయ్ హోప్‌(19) ఫోర్లు, సిక్స్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. చివ‌రికి కెప్టెన్ పంత్ 16 ప‌రుగుల‌తోనూ, సుమిత్‌కుమార్ 9 ప‌రుగుల‌తో నాటౌట్‌గా మిగిలి 8.5 ఓవ‌ర్ల‌లో 92 ప‌రుగుల‌తో ప‌ని పూర్తిచేసారు.

Latest News