వైభవ్ తమ్ముడొచ్చాడు…10ఏళ్లకే సెంచరీతో రికార్డు

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కేవలం 10 ఏళ్ల వయసులోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్‌లో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగులతో మెరిశాడు.

ధనాధన్ ఆటతో ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుటికే క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగుతుంది. ఎంత పెద్ద బౌలర్ అన్నది చూడకుండా బంతిని బాదడమే తన పని అన్నట్లుగా సిక్సర్లు, ఫోర్లను దంచేస్తూ..రికార్డు సెంచరీలు చేసేస్తూ టీమిండియాలోకి దూసుకొచ్చాడు వైభవ్. 15 ఏళ్ల వయసులోనే సీనియ భారత జట్టుకు ఎంపికై.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డునే బ్రేక్ చేశాడు ఈ చిచ్చర పిడుగు. అయితే ఇప్పుడు అదే వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో సంచలన క్రికెట్ వెలుగులోకి వచ్చాడు. ఆయనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ.

వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ బాది యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ.. అన్న బాటలోనే ఆశీర్వాద్ అడుగులు వేస్తున్నాడు. తాజాగా బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ అద్భుతమైన సెంచరీతో చెల‌రేగాడు. ‘క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్’ జట్టు తరపున ఆడిన ఈ జూనియర్‌ వైభవ్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. తనకంటే సీనియర్ బౌలర్లను కూడా ఆశీర్వాద్ ఉతికి ఆరేశాడు.

తమ్ముడి బ్యాటింగ్ విన్యాసం చూసిన సూర్యవంశీ… సోషల్ మీడియా ద్వారా ఆశీర్వాద్‌కు అభినందనలు తెలిపాడు. ఆశీర్వాద్ స్కోర్ కార్డ్‌కు సంబంధించి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ లో మరోసారి సూర్యవంశీ బ్రదర్స్ రూపంలో ధనాధన్ సూపర్ స్టార్లు అవిర్భవించిన అశ్చర్యం లేదంటున్నారు నెటిజన్లు. త్వరలోనే ఆశీర్వాద్ సూర్యవంశీని ఐపీఎల్ లో చూడవచ్చేమో అంటు కామెంట్లు చేస్తున్నారు.

Latest News