Indiramma Indlu । ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇస్తున్నామని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరా గాంధీ కల్పించారని కొనియాడారు. గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదని చెప్పగలనని సీఎం అన్నారు. కూడు.. గూడు.. గుడ్డ… నినాదాన్ని ఇందిరా గాంధీ ఆచరణలోకి తీసుకువచ్చారన్నారు. సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజనులు, దళితులకు మిగులు భూముల పంపిణీ చేపట్టారని చెప్పారు.
ఇందిరమ్మ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.10 వేలు కేటాయిస్తే.. వై.ఎస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.1.25 లక్షలకు చేరిందని, పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు తమ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌ఛానల్ ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షలు అందజేస్తామని చెప్పారు. తొలి ఏడాది సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తామని, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, దళితులు, గిరిజనులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఐటీడీఏల పరిధిలోని నియోజకవర్గాలు, ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నల్లమలలోని చెంచులు… ఆదిలాబాద్‌లోని గోండులు… భద్రాచలంలోని కోయలు.. ఎవరైతే తెలంగాణ మట్టి మనుషులో.. తెలంగాణ మూల పురుషులో వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా కేటాయిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఈ నమూనానే పాటించాలని తాము సూచించడం లేదని, అదే సమయంలో తమకున్న స్థలంలో ప్రతి అంగుళాన్ని లబ్ధిదారులు వినియోగించుకునేలా ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్‌లు నిర్మిస్తామని.. లబ్ధిదారులు తమ అవగాహన కోసం వాటిని చూడాలని రేవంత్ రెడ్డి సూచించారు. లబ్ధిదారులు తమ స్థోమతకు తగ్గట్లు అదనపు గదులు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వానివి 25 లక్షల ఇళ్లు.. బీఆర్ఎస్‌కు 65 వేల ఇళ్లు…
2004 నుంచి 2014 వరకు పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 25.04 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో కేవలం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించి 65 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదని… కానీ ఆరు నెలల్లో ఆయన కోసం కోట లాంటి ప్రగతి భవన్‌ను, వాస్తు కోసం సచివాలయాన్నినిర్మించుకున్నారని, గజ్వేల్, జన్వాడల్లో ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.