హైదరాబాద్, అక్టోబర్ 7 (విధాత):
Aditya Vantage Hydra |మూసీ రివర్ బెడ్‌లో 9 ఎకరాల విస్తీర్ణంలో ఆదిత్య వాంటేజ్ బహుళ అంతస్థుల నిర్మాణంపై హైడ్రా ఆరా తీస్తున్నది. పూర్తి వివరాలు వచ్చిన తరువాత చర్యలు తీసుకోవాలన్న యోచనలో హైడ్రా ఉంది. ఈ సమాచార సేకరణ బాధ్యతను ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఒకరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇతనికి కావాల్సిన సాంకేతిక సహకారం అందించడానికి మరో ఇద్దరు అధికారులను కూడా కేటాయించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల రెవెన్యూ గ్రామం పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ 18 (ఏ) ఎగ్జిట్ వద్ద మూసీ రివర్ బెడ్‌లోనే నిర్మితం అవుతున్న ఈ బహుళ అంతస్తుల భవనానికి అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? సాగునీటి పారుదల శాఖ నిరభ్యంతర పత్రం ఏ బేసిస్ మీద ఇచ్చారు? అనే అంశాలతోపాటు.. వాస్తవంగా రివర్ బెడ్ అక్కడ ఎంత ఉండాలి? బఫర్ జోన్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఎంత ఉంది? ఏ ప్రమాణాల ప్రకారం నిరభ్యంతర ప్రతం ఇచ్చారనే వివరాలను హైడ్రా సేకరిస్తున్నది. నిరభ్యంతర పత్రం వచ్చిన తరువాత హెచ్ ఎండీఏ అనుమతులు ఎలా ఇచ్చింది? ఈ స్థలాన్ని పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు తెలిపిందా? లేక కాగితం ఆధారంగానే అనుమతులు ఇచ్చిందా? అనే వివరాలు కూడా తీసుకుంటున్నది.
ఆదిత్య వాంటేజీది అక్రమ నిర్మాణం అని భావించిన హెచ్ఎండీఏ నార్సింగి పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది, ఈ మేరకు నార్సింగి పోలీసులు క్రైమ్ నంబర్ 1006/2003 కింద ఫిర్యాదు తీసుకున్నారు. ఈ ఫిర్యాదు మీద పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటి? ఫిర్యాదు చేసిన హెచ్ఎండీఏనే ఏవిధంగా అనుమతి ఇచ్చింది? ఇలాంటి అనేక సందేహాలపై హైడ్రా పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్నది. మరో వైపు ఆదిత్య వాంటేజ్ ప్రతినిధులు ఏ బేస్‌లో కోర్టు నుంచి ఆదేశాలు తీసుకు వచ్చి నిర్మాణం చేస్తున్నారు? ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కౌంటర్ వేశారు? ప్రభుత్వం వినిపించిన వాదనలు ఏంటి? ఇలాంటి సాంకేతిక వివరాలు తీసుకుంటున్నది. దీంతో పాటు సర్వే ఆఫ్ ఇండియా నుంచి సర్వే మ్యాపులు కూడా తీసుకొని వాస్తవ మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లను నిర్థారించుకోవాలని హైడ్రా నిర్ణయించిందని సమాచారం. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు కూడా హైడ్రా సేకరిస్తున్నది. ఇలా అన్ని రకాల సమాచారం సేకరించిన తరువాతనే చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా హైడ్రా అధికారులు సమాచార సేకరణ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇవి కూడా చదవండి..
Musi Encroachments | పోటెత్తిన భారీ వరద.. ఒడ్డునే యథేచ్ఛగా నిర్మాణాలు.. మూసీ చెప్పిన కబ్జా కథ!
Musi River Encroachments Aditya Builders | మూసీ బొండిగ పిసికిన ఆదిత్య బిల్డర్స్.. చోద్యం చూస్తున్న హైడ్రా, హెచ్ఎండీఏ!