Site icon vidhaatha

Telangana Assembly | గందరగోళం మధ్య ద్రవ్య వినియమ బిల్లుకు ఆమోదం..గురువారానికి సభ వాయిదా

విధాత, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ బుధవారం తీవ్ర గందరగోళం మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లు చర్చ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలపై చేసిన విమర్శలపై బీఆరెస్ సభ్యులు నినాదాలతో నిరసనలు వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందినట్లుగా ప్రకటించాచి సభను గురువారం ఉదయం 10గంటలకు వాయిదా వేశారు. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ ప్రారంభం కాగా, ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై బీఆరెస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ చ‌ర్చ ప్రారంభించారు. గత ప్ర‌భుత్వం చేసిన మంచి ప‌నుల‌ను మ‌రోసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో కేటీఆర్ ప్ర‌సంగానికి అధికార పార్టీకి చెందిన మంత్రులు, స‌భ్యులు ప‌లువురు అడ్డు త‌గిలారు. కేటీఆర్‌తో సంవాదం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ సభ్యులు నిరసనకు దిగడంతో స‌భ‌లో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల న‌డుమ స‌భ‌ను ప‌ది నిమిషాల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ తిరిగి స‌భ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల స‌మ‌యంలో ప్రారంభ‌మైంది. స‌బితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని బీఆరెస్ సభ్యులు ప‌ట్టుప‌ట్టారు. స్పీక‌ర్ పోడియంలోకి దూసుకెళ్లిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళ‌న‌కు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అహంకారం న‌శించాలి అని నినాదాలు చేశారు. స్పీక‌ర్ వినిపించుకోకుండా అధికార స‌భ్యుడు గ‌డ్డం వివేక్‌కు అవ‌కాశం ఇచ్చారు. బీఆరెస్‌ స‌భ్యులు స్పీక‌ర్ పోడియంలోకి వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. స‌బిత‌కు మైక్ ఇచ్చేందుకు సుముఖంగా లేని ప్ర‌భుత్వం.. చివ‌ర‌కు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ స‌భ్యుల‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండానే ద్ర‌వ్య వినిమ‌య బిల్లును ఆమోదింపచేసింది. అనంత‌రం స‌భ‌ను గురువారానికి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనసభ నుంచి బీఆరెస్ సభ్యులు బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ధ మాట్లాడారు.

Exit mobile version