వ్యవసాయశాఖ నుంచి డేటా సేకరిస్తున్న ప్రభుత్వం
రెండు విడతలుగా ప్రీమియం చెల్లింపు
రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులకు బీమా వర్తింపు
విధాత, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకాన్ని కొనసాగించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. పంద్రాగస్టుతో పాత బీమా గడువు ముగుస్తుంది. ఆ లోపే ఈ బీమాను రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఈ మేరకు వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను తెప్పించుకుంటున్నది. అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జిల్లాల వారీగా డేటాను రూపొందించి ఆగస్టు 2 నాటికి పూర్తి వివరాలను ఫ్రీజింగ్ చేయనున్నారు. గతంలో దాదాపు 40 లక్షల మంది రైతుల వరకు ఈ బీమా వర్తించింది. ఈసారి మరింత మంది పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 18-59 ఏండ్ల వయస్సు కలిగి, పట్టాదారు పాసు పుస్తకం ఉంటే చాలు వారికి బీమా వర్తిస్తుంది.
రైతు చనిపోతే వెంటనే వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే నిమిత్తం గత ప్రభుత్వం ఈ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అంతకు ముందు రైతు చనిపోతే ఇంత మొత్తం ఇచ్చేవారు కాదు. దీనికి తోడు ఎంక్వైరీ పేరుతో కాలయాపన జరిగేది. బాధిత కుటుంబానికి సాయం అందాలంటే చాలా సమయం తీసుకునేది. రైతుబీమా స్కీం ప్రవేశపెట్టిన తరువాత రైతు మరణిస్తే కొద్ది రోజుల్లోనే ఆ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల సాయం చెక్కు రూపంలో అందుతున్నది. ఇప్పుడు ఇదే స్కీమ్‌ను రేవంత్ సర్కార్ కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు 14 నుంచి కొత్త బీమా కోసం రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. రెండు విడతలుగా ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది.