షాబాద్ హత్యలతో భీతిల్లుతున్న భగీరథ్ బాధితులు

తెలంగాణ రాష్ట్రం పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారిందని, ఇలా చెప్పడానికి చాలా బాధగా ఉందని, కానీ వాస్తవం అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

విధాత, హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రం పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారిందని, ఇలా చెప్పడానికి చాలా బాధగా ఉందని, కానీ వాస్తవం అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. షాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని దైవాలగూడలో రాత్రి 11 నుండి 1 గంట వరకు రాజ్ కుమార్ అనే నిందితుడు బాధితులను నరికి చంపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆరు హత్యలు చేసిన కిరాతకుడు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడని, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి, ఇగో కోసం పెట్టుకున్న పోలీసు కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ పరిధిలోనే ఆరు హత్యలు జరిగాయన్నారు. నిందితుడికి గంజాయి మద్యం సేవించడం వంటి దురలవాట్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘చిన్నారుల ఫ్యూచర్ కాపాడలేని కమిషనరేట్ ఎందుకు? మీ భూముల రక్షణ కోసమా, మీ ఆస్తుల పరిరక్షణ కోసమా? అసలు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఎందుకు?’ అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. తెలంగాణ భవన్ లో శనివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. షాబాద్ పీఎస్ పరిధిలోని దైవాలగూడలో లక్ష్మీ అనే మహిళ, ఇంటర్ చదువుతున్న తన మైనర్ కుమార్తె పై నిందితుడు రాజ్ కుమార్ అత్యాచార యత్నం, హింసకు దిగుతున్నాడని మే 16 న పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇపుడు లక్ష్మీ చేవెళ్ల ప్రభుత్వాసుత్రి మార్చురీలో విగత జీవిగా ఉందన్నారు. వాళ్ల ఇంటి పక్కనే ఇల్లు కిరాయి తీసుకుని, సీసీ కెమెరాలు పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపిందన్నారు. అమ్మాయి కాలేజీ మార్చినా ఆ నిందితుడు మళ్లీ ఆ కాలేజీకి వెళ్లి చేయి పట్టుకొని లాక్కెళ్లాలని ప్రయత్నాలు చేశాడన్నారు. సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు ఆ నిందితున్ని అరెస్ట్ చేయలేదన్నారు. మహిళా పోలీసు అధికారులు వచ్చి బాధిత అమ్మాయితో కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదని విమర్శించారు. సెక్షన్ 161 కింద పోక్సో కేసులో కేసు వివరాలు, బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? ఎందుకు చేయలేదు? అని ఆయన అడిగారు. ఈ కేసులో మే 16 న కేసు నమోదైతే, నిందితుడు జూన్ 12 న బెయిల్ తీసుకొని జూన్ 16 న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి జులై 10 న ఆరుగురిని హత్య చేశాడన్నారు.

తెలంగాణ పోలీసులు న్యాయం చేయరా?

అమ్మాయిలు, మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరిగినపుడు వారిని కాపాడడం కోసం ఏమైనా చేసి వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ట్రైనింగ్ లో చెప్తారన్నారు. తెలంగాణ పోలీసు అధికారులు అవన్నీ మరిచిపోయారా? అని అడిగారు. షాబాద్ కు రాకుండా అన్ని ద్వారాలను మూసేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు కదా… నిందితుని కోసం ఎందుకు ఇలాంటి బందోబస్తు పెట్టలేదన్నారు. నిందితున్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే విలువైన ఆరు ప్రాణాలు కాపాడబడేవి అన్నారు. పోలీసులకు చేతకాకపోతే నేను ప్రైవేట్ కేసు పెడుతా అని బాధితురాలి మామ అంటున్నాడంటే… పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హోం మంత్రిగా రేవంత్ రెడ్డి ఫోక్సో కేసులపై ఏనాడైనా రివ్యూ చేశారా? చేయడం లేదా అన్నారు. షాబాద్ ఘటనలో స్థానిక ఎస్ఐ ని సస్పెండ్ చేసి వదిలేశారని, సీఐ, ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ని కాపాడడానికే అత్యాధునిక ఆయుధాలు ఇస్తున్నారని ఆరోపించారు. అమ్మాయిలు, మహిళలను కాపాడడానికి పోలీసు యంత్రాగాన్ని ఎందుకు వినియోగించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసేందుకే రేవంత్‌ వద్ద హోం శాఖ

ప్రతిపక్షాలను ముప్పు తిప్పలు పెట్టాలనే, రేవంత్ రెడ్డి హోంశాఖను తన దగ్గర ఉంచుకున్నారు. ఫోక్సో కేసుల్లో బెయిలబుల్ కేసులు పెట్టడం మానుకోవాలని, ఈ కేసుల్లో బెయిల్ ఇచ్చి ఉంటే డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే పునః సమీక్షించి వాటిని రద్దు చేయాలన్నారు.

పేట్ బషీరాబాద్ బాధితులు భయం భయం…

పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో బండి సాయి భగీరథ్ పై నమోదు అయిన ఫోక్సో కేసులో బాధిత తల్లి, ఆమె కుమార్తె ఈ రోజు తనతో మాట్లాడారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. షాబాద్ ఊచకోత ఘటనతో భీతిల్లిన పేట్ బషీరాబాద్ బాధిత తల్లి మాట్లాడుతూ, తన బిడ్డ మీద అత్యాచారం చేసిన నిందితుడు కూడా బెయిల్ పై బయట ఉన్నాడన్నారు. మున్ముందు ఇలాగే నా కుమార్తెను చంపితే ఎలా? అని ఆమె భయాందోళన వ్యక్తం చేశారన్నారు. నిందితుడికి బెయిల్ రద్దు చేసే అవకాశం ఏమైనా ఉందా? అని తల్లి, కుమార్తె తనను అడిగారన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు బెయిల్ అడ్డుకోలేదు? అని ఆయన అడిగారు. అమ్మాయికి సంబంధించిన వీడియోలు ముందుగానే సోషల్ మీడియాలో షేర్ చేసి, నిందితుడు భగీరథ్ క్రూరంగా ప్రవర్తించాడన్నారు. తనకు దక్కనపుడు ఎవరికీ దక్కొద్దు అనే విధంగా వ్యవహరించాడన్నారు. ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూథ్రాను నియమించుకుని, నిందితులకు బెయిల్ రాకుండా ఎందుకు ఆపలేదు? అని నిలదీశారు. రహస్యంగా నిందితునికి మధ్యంతర బెయిల్ ఇచ్చారని, పరీక్షలు జైలులో పెట్టొచ్చు కదా అని అన్నారు. మంత్రి బండి సంజయ్, సంగప్ప సమక్షంలోనే తమ కుటుంబాన్ని బెదిరించారని బాధితులు చెప్పిన తర్వాత కూడా కనీసం వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. బాధితులతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాల్ చేసి మాట్లాడలేదని, ఎందుకు పట్టించుకోలేదో వివరించాలన్నారు. ఈ కేసులో కూడా ముందుగా పోలీసులు బెయిలబుల్ కేసులు పెట్టారని, బీఆర్ఎస్ పోరాటం తర్వాత సెక్షన్లు మార్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, నిందితుడికి నేర చరిత్ర ఉందన్నారు. బాధితురాలిపై నమోదు అయిన హనీ ట్రాప్ కేసు ఇప్పటికీ ఆ కేసు కొట్టేయలేదన్నారు. ఫేక్ కేసు అని తెలిసినా రేవంత్ రెడ్డి ఎందుకు కొట్టివేయించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ ఎక్కడ పోయింది, బాలల హక్కుల కమిషన్ ఎక్కడ ఉందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

Latest News