స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం శనివారం నాడు నిర్ణయం తీసుకుందని సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు స్టే ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరో వైపు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషనర్లు కేవియట్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన వినాలని బి.మాధవరెడ్డితో పాటు మరో పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ చివరల్లో తెలంగాణ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జారీ చేయడం వల్ల రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ నెల 9న బీసీ రిజర్వేషన్లపై స్టే విధించింది. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని స్పషం చేసింది.
రాష్ట్రంలో బీసీల జనాభా 57.6 శాతం ఉన్నందున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదే వాదనను సుప్రీంకోర్టులో వినిపించనుంది. హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నాడు న్యాయ నిపుణులతో చర్చించింది.