Local Body Elections | హైదరాబాద్ : తెలంగాణ( Telangana )లో స్థానిక సంస్థల ఎన్నికలకు( Local Body Elections ) సమయం సమీపిస్తోంది. ఆశావహులు ఓ వైపు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే, మరో వైపు పోటీకి కావాల్సిన ధృవపత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో సందడి నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అర్హతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం( State Election Commission ) మార్గదర్శకాలను నిర్దేశించింది.
మార్గదర్శకాలు ఇవే..
- నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 ఏండ్లు నిండి ఉండాలి.
- పోటీ చేసే గ్రామం, నియోజకవర్గంలో ఓటు హక్కును కలిగి ఉండాలి.
- గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలు( Anganwadi Teachers ) పోటీకి అనర్హులు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా పోటీ చేసేందుకు అవకాశం లేదు.
- మతిస్థిమితం లేని వారు, పూర్తిస్థాయి బధిరులు అనర్హులు.
- మత సంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు.
- సింగరేణి, ఆర్టీసీలలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పని చేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అనర్హులు.
- క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి.. శిక్ష విధించిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు.
- పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు.
- పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్ట్ చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న గుత్తేదారులు పోటీకి అర్హత ఉండదు.
- రేషన్ డీలర్లు( Ration Dealers ) పోటీకి అర్హులు.