Site icon vidhaatha

Seethakka: మహిళలకు గుర్తింపునిచ్చేలా.. సమాజంలో మార్పు అవసరం

విధాత, వరంగల్: మహిళలకు తగిన గుర్తింపునిచ్చే విధంగా సమాజంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రతి ఇంటిలో ఆడవారిని గౌరవించే విధంగా పిల్లలకు నేర్పించాలని పెద్దలు, తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలల్లో సైతం గురువులు అదే విధంగా బోధించాలని కోరారు. మహిళ పట్ల దురభిప్రాయంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి గురువారం ఆమె ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మీడియాలో మహిళల పట్ల వున్న వివక్షత పోవాలన్నారు. రిపోర్టింగుకు వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ఇబ్బందులకు గురవుతారన్నారు. మహిళా జర్నలిస్టుల వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకుందన్నారు.

ప్రజలకు న్యాయం జరిగే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని కోరారు. ఉమెన్ ఓరియెంటెడ్ స్టోరీస్, స్ఫూర్తిదాయక స్టోరీస్ అందించాలని సూచించారు. మహిళల పట్ల విలువలతో కూడిన అంశాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల్లో మార్పుకు మీ కలాన్ని వినియోగించాలన్నారు. ప్రతి ఉద్యమం వెనుక జర్నలిస్టుల పాత్ర ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి చేయడంలో జర్నలిస్టులు మీడియాది కీలక పాత్రగా పేర్కొన్నారు. మీడియాలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలన్నారు. మీ సలహాలు, సూచనలకు అనుగుణంగా మీడియలో పనిచేసే మహిళల రక్షణ కోసం నూతన పాలసీని రూపొందిస్తామని హామీఇచ్చారు.నిజాన్ని నిర్భయంగా బయట పెట్టేందుకు మా ప్రభుత్వం మీకు రక్షణగా నిలుస్తుందన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయని చెప్పారు. మీ ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం ఆవిర్భవించిందన్నారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని వివరించారు. శ్రామిక మహిళల శ్రమకు తగిన గుర్తింపు నిచ్చే విధంగా మహిళలు ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని వివరించారు. వివక్షను రూపుమాపేందుకు మనం ఆలోచించే విధానాల్లో మార్పు రావాలని సీతక్క పిలుపునిచ్చారు.

Exit mobile version