విధాత : నేను రైతునే నాకు వ్యవసాయంలోని సాదక బాధలు తెలుసంటూ తరుచు చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సొంతంగా సెంటు సాగు భూమి కూడా లేదట. అలాగే సొంత కారు కూడా లేదు. ఇది ఆయన తన తాజా ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా వెల్లడించిన ఆసక్తికర అంశాలు. అయితే 2018ఎన్నికల నాటి అఫిడవిట్‌తో పోలిస్తే 2023ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ ఆస్తులు పెరిగాయి. కేసీఆర్ తాజా అఫిడవిట్ మేరకు ఆయన పేరు మీద సెంటు సాగు భూమి కూడా లేదని, ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయి.
కాగా.. నాలుగు నెలల క్రితం జూలైలో పది ఎకరాల సాగు భూమిని మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో కొన్నారు. దీని విలువ సుమారు 28.47 లక్షలు గా పేర్కొన్నారు. కేసీఆర్ కు స్థిర ఆస్తులు 17.83 కోట్లు, చర ఆస్తుల రూపంలో 9.6 కోట్లుగా ఉన్నాయి. ఆయన భార్య శోభ పేరు మీద 7.78 కోట్ల చర ఆస్తులున్నాయి. ఉమ్మడిగా 9.81చరాస్తులు ఉన్నాయి. సొంతంగా కేసీఆర్‌కు కారు, బైక్ లేకపోయినా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలు ఉన్నాయి. వీటి విలువ 1.16 కోట్లుగా పేర్కోన్నారు. మొత్తంగా కేసీఆర్ కుటుంబానికి 53.30 ఎకరాల సాగు భూములు, 9.36 ఎకరాల మేర వ్యవసాయతర భూములు ఉన్నాయి.
గత ఎన్నికల్లో 2018 డిసెంబర్ సమయానికి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి 5.63 కోట్లు ఉంటే ఇప్పుడు 11.16 కోట్లకు పెరిగింది. భార్య శోభా ఆస్తి సుమారు 94 వేల మేరకే ఉంటే ఇప్పుడు అది 6.29 కోట్లకు పెరిగింది. బంగారు ఆభరణాలు మాత్రం 2.8 కిలోలు ఉన్నట్లుగా తాజాగా సమర్పించిన అఫిడవిట్లో కేసీఆర్ పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అప్పులు ఆయన పేరు మీద 17.27 కోట్లు, కుటుంబం పేరు మీద 7.23 కోట్ల మీద ఉన్నాయి.