బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతులకు సబ్సిడీపై రైతు వేదిక లో అందుబాటులో ఉంచాలని, సన్న వడ్లు పండించే రైతుల డేటా సేకరించాలని, ధాన్యం దిగుబడి పైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడం దమ్మపేటలో ప్రారంభించినపైలెట్ ప్రాజెక్ట్ ను విస్తరించి ఏఐ-సాంకేతికత పెంచాలని, ఈ పైలెట్ ప్రాజెక్ట్ ను మరింతగా వినియోగించుకోవాలని సూచించారు. వసాయ శాఖ లో సాంకేతికతను మరింత పెంచుకోవాలని, ఏఐని మరింత గా వినియోగించాలని స్పష్టం చేశారు.
సాంకేతికత పెంచుకోవాలి..
అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీ గా పెట్టుకొని సాంకేతికత ను పెంచుకోవాలని సూచించారు. సీడ్స్ నుంచి కొనుగోలు వరకు
వ్యవసాయ శాఖ ,సివిల్ సప్లయిస్,అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలన్నారు. మార్క్ ఫెడ్ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని, ఆయిల్ ఫెడ్ ను బలోపేతం చేసుకోవాలని, అన్ని ఫెర్టిలైజర్స్ కి యాప్ పెట్టాలని తెలిపారు.
యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలని, జిల్లా అదనపు కలెక్టర్ కు యూరియా పంపిణీ బాధ్యత ను అప్పగించాలని సూచించారు. యూరియా,ఇతర ఎరువుల కేటాయింపులపైన ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. ఎరువుల పరిస్థితి పైన అన్ని పార్టీ ల ఎంపీల సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బోనస్ ఇచ్చే సన్నల రకాలపై అయోమయం
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సన్నలకు బోనస్ ప్రకటించిన సందర్బంలో 33 రకాల సన్నాలను నోటిఫై చేస్తూ వ్యవసాయ శాఖ 2024 జూలై 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేవలం 7రకాల సన్న ధాన్యం రకాల విత్తనాలను మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించడంతో..మిగతా వాటికి బోనస్ ఇవ్వారా?..అసలు సన్న ధాన్యం రకాల జాబితాను అధికారికంగా..తాజాగా ఏడుకు కుదించారా? అన్న దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
