Site icon vidhaatha

C.M. REVANTH REDDY | సాయం చేసే గుణమే కమ్మల గొప్పతనం … కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

కమ్మల అభివృద్ధికి చేయూతనందిస్తాం
ఎన్టీఆర్ సంకీర్ణ రాజకీయాలే దేశాన్ని ఏలుతున్నాయి
జాతీయ స్థాయిలో తెలుగు నాయకులు ఎదగాలి

విధాత, హైదరాబాద్ : కష్టపడటం.. పది మందికి సాయం చేసే గుణమే కమ్మ కులస్థుల గొప్ప తనమని, క‌మ్మ అంటే అమ్మ లాంటి ఆలోచ‌న అని, అమ్మ క‌డుపు చూస్తుంది, బిడ్డఆక‌లి చూస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు. కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడిన కమ్మ వాళ్ళు ఎక్కడ వున్నారో పెద్దగా రీసెర్చ్ చెయ్యాల్సిన అవసరం లేదని, సారవంతమైన నేల, సంమృద్ధిగా నీళ్లు ఎక్కడ వుంటాయే అక్కడ కమ్మ వాళ్ళు వుంటారని, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా సారవంతమైన నేలలు మంచి పంటలు పండించ గలిగిన, మంచి పంటలు పండుతాయనుకునే భూమి వున్నప్రతి చోట కమ్మ వాళ్ళు వుంటారని కితాబినిచ్చారు. కొండ మీద అమ్మ వారు.. కొండ కింద కమ్మ వారన్నట్లుగా కమ్మలు వ్యవహారిస్తారన్నారు. అమ్మలాంటి ఆప్యాయత, నేలను నమ్ముకుని కష్టపడి పనిచేయడం కమ్మల లక్షణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమ్మసామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుందని, దివంగత సీఎం ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు..మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిందన్నారు. అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నానన్నారు. రాజకీయాలకు, నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని, ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు.

జాతీయ స్థాయిలో తెలుగు నాయకులు ఎదగాలి

దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయన్నారు. మాకు భేషజాలు లేవు.. మేం కులాన్ని అభిమానిస్తామని, ఇతర కులాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని, అది మా ప్రభుత్వ విధానం కాదన్నారు. మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు అని, నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3న మీరు చూశారన్నారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోందని, కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలన్నారు. ఢిల్లీలో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తోందని, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పీవీ లాంటి తెలుగు వారు లేరని, ఢిల్లీలో మన తెలుగు వారు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మా ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. వివాదంలో ఉన్న 5ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు. భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పదిమందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరుతున్నానని పేర్కోన్నారు.

Exit mobile version