- ఎన్డీఎస్ఏను ఒప్పించి ఈటల మాట్లాడాలి
- సీబీఐ విచారణ ఎందుకు జరగడం లేదో చెప్పాలి
- తెలంగాణవాదం ముసుగులో ఇంజినీర్ల విమర్శలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్:
మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తిపోయాలని బీఆరెస్ నేతలు మాట్లాడుతున్నారని, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీఆరెస్ వాదనను తీసుకుని కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజేందర్ అంటే తమకు గౌరవమేనని, కానీ ఆయన మాట్లాడిన మాటలపై గౌరవం లేదన్నారు. కేంద్రంలోని జలశక్తి మంత్రితో కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులతో కానీ వివరాలు తెలుసుకుని మాట్లాడితే ఆయన గౌరవం మరింత పెరిగేదన్నారు. మాజీ మంత్రి టీ హరీష్ రావు సూచనల మేరకు ఈటల మాట్లాడటం ద్వారా ఆయన గౌరవాన్ని కోల్పోయారన్నారు. ఇంజినీర్లు తెలంగాణ వాదం ముసుగులో… బీజేపీ, బీఆరెస్ తరఫున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. శనివారం జూబ్లిహిల్స్ లోని బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
సమస్య పట్టించుకోకపోవడం వల్లే పెరిగి పెద్దదైంది..
జూన్ 29, 2019 న అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించగా, మే 18, 2020న మేడిగడ్డ బ్యారేజీలో లోపాలున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారావు లేఖ రాశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 11 నెలల్లోనే మేడిగడ్డ బరాజ్‌లో లోపాలు బయటపడినా, ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో అది పెరిగి పెద్దదై కుప్పకూలే స్థితికి చేరిందన్నారు. అక్టోబర్ 21, 2023 న మేడిగడ్డ కుంగిపోయిందని, మరుసటి రోజే సంబంధిత ఏఈ దీనిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేషనల్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయని నవంబర్ 1, 2023 న ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ మా దగ్గరికే ఎందుకొచ్చిందని వాళ్లు మాట్లాడుతున్నారు, దేశంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 డిసెంబర్ 30, 2021 నుంచి అమల్లోకి వచ్చిందని వివరించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 చట్టం ప్రకారం ఎక్కడైనా నిర్దేశిత డ్యామ్ ల పర్యవేక్షణ, నిర్వహణ, తనీఖీలు చేసే అధికారముందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఎన్డీఎస్ఏ మేడిగడ్డను తనిఖీ చేసిందని, 7వ బ్లాకు దెబ్బతినడం వల్ల బరాజ్‌లో నీళ్లు నింపితే ప్రమాదమని తన ప్రాథమిక నివేదికలో చెప్పిందని గుర్తు చేశారు. వివిధ పరీక్షలు, క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం.. పది నెలల తర్వాత ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చిందన్నారు. అందులోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చిచెప్పిందని తెలిపారు. 346వ పేజీలో మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బరాజ్ నుంచి నీటి మళ్లింపునకు పనికి రాకుండా పోయిందని తెలిపిందన్నారు. 352వ పేజీలో అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిందని, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పారని సీఎం పేర్కొన్నారు. 356వ పేజీలో సుందిళ్ల బరాజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటి మళ్లించటం సురక్షితం కాదని నివేదికలో ఉంది అని గుర్తు చేశారు. ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17వ పాయింట్ లో… మూడు బ్యారేజీల తీవ్ర నష్టాలను క్రోడీకరించిందని, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసిందని చెప్పారు. మొత్తం బరాజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి, ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను సిఫారసు చేసిందని, పునరుద్ధరణ డిజైన్లు,రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సీడబ్ల్యుసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని తెలిపారు.
పంపింగ్‌కు తగిన నీటి మట్టం లేదు
ప్రవాహం ఉండటం వేరు, పంపింగ్‌కు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ కనీస పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు కావాలి కాని ఇప్పుడు అక్కడ ప్రస్తుతం 89.90 మీటర్లే ఉందన్నారు. అన్నారం, సుందిళ్లలో కూడా గేట్లు మూస్తే తప్ప చుక్క నీరు నిల్వ ఉండదు. ఆ బ్యారేజీలు భద్రంగా లేవని గేట్లు మూసి నీటిని నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ ఇప్పటికే స్పష్టంగా సూచించింది. అలాంటప్పుడు “నీళ్లు ఎత్తిపోసేయండి” అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మేడిగడ్డ బెడ్ లెవల్ 88.50 మీటర్లు కాగా క్రెస్ట్ లెవల్ 89.50 మీటర్లు అన్నారు. అక్కడ నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌజ్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలంటే కావాల్సిన పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు అని చెప్పారు. మేడిగడ్డ వద్ద ప్రవాహం ఉన్నా నీటిమట్టం పంపింగ్ చేసే స్థాయి 93.50 మీటర్లు లేదు. అన్నారం, సుందిళ్ల బరాజ్ ల వద్ద ఇదే పరిస్థితి ఉందని, కన్నెపల్లి నుంచి ఎత్తిపోసినా.. అక్కడ గేట్లు ఓపెన్ ఉన్నందున.. అవి కూడా మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందేనన్నారు. ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు అక్కడ గేట్లు క్లోజ్ చేసేందుకు వీల్లేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల పునరుద్ధరణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 జూన్ 30న ఈ కమిటీ వేసిందని, మూడు బరాజ్ వద్ద నిర్మాణపరమైన సమస్యలున్నాయని ఇందులో కూడా స్పష్టం చేసింది. మూడు బరాజుల డిజైన్, పునరుద్ధరణ ప్రతిపాదనలకు సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు విచారణలు, నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ, ఏమైనా మార్పులు చేస్తే ఈ కమిటీకి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుందని సీఎం అన్నారు.
కేసీఆర్ కిలాడీల కమిటీ…
రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనలు పాటిస్తే ఉంటే… కెసీఆర్ వైపు నుంచి కిలాడీల కమిటీ ఏర్పాటు చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిలాడీల కమిటీలో కేసీఆర్ చైర్మన్, హరీష్ రావు, కేటీఆర్ సభ్యులుగా ఉన్నారు. ఇపుడు ఈటల కూడా అందులో సభ్యులుగా చేరారు. చర్లపల్లి జైలుకు పంపితే వాళ్లు చేసిన అప్పులెంటో, తప్పులేంటో తెలిసేదన్నారు. హరీష్ రావును ఆనాడు వాళ్ల మామనే నమ్మలేదని, నువ్వు కమీషన్లు బొక్కిన సంగతి తెలిసి ఆనాడు నిన్ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా ఆరు నెలలు పక్కనబెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో ఆయన ఇప్పుడు క్రషర్లను కూడా వదలడంలేదన్నారు. ఆంధ్రా సంస్థలని ఆనాడు విమర్శించిన హరీశ్ నారాయణ, చైతన్య విద్యా సంస్థలకు పాలు పోసి బతుకుతున్నాడని విమర్శించారు. అలాంటి బతుకు బతుకుతున్న నీదీ ఒక బతుకేనా అన్నారు. బీఆరెస్ హయాంలో పట్టిసీమకు 105 టీఎంసీలు తరలించినపుడు హరీష్ గాడిదలు కాసారా?. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వినియోగంలోకి వస్తే పోలవరంకు నీళ్లు పోవని చెప్పగలరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్డీఎస్ఏ ను ఈటల ఒప్పించి మాట్లాడాలి…
ఈటల రాజేందర్ ఈ కిలాడీ కమిటీని ఎన్డీఎస్ఏ కమిటీ వద్దకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నేను రెండే రెండు డిమాండ్లు ఈటల రాజేందర్ ముందుంచుతున్నాను… ఢిల్లీలో ఎన్డీఎస్ఏ ను కలిసి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పండి, ఆ తరువాత మేము సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. సీబీఐ వద్ద మూలుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేసుపై విచారణ ముందుకు తీసుకెళ్లేలా చేయాలని కోరారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణను మేం సీబీఐకి అప్పగించామన్నారు. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ జీఓ నెం 104 జారీ చేసిందని, ఇప్పటికీ విచారణ ఎందుకు ప్రారంభించ లేదో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ గజదొంగల గుంపులో రాజేందర్ చేరొద్దు అని హితవు పలికారు. తమ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల ప్రకారం ప్రాజెక్టు పునరుద్ధరణపై ముందుకు వెళుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
