రాజ్యాంగానికి అత్యంత ప్రమాదకారి మోదీ

రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి ప్రధాని నరేంద్రమోదీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. హంటర్ రోడ్ లో సోమవారం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం హనుమకొండ

  • Publish Date - April 29, 2024 / 06:01 PM IST

  • దేశాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ కు మద్దతు
  • సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ
  • హబీజేపీకి ఓటు వేస్తే ఆత్మహత్యా సదృశ్యమే
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

విధాత, వరంగల్ ప్రతినిధి: రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి ప్రధాని నరేంద్రమోదీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. హంటర్ రోడ్ లో సోమవారం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ ఈడీ, సీబీఐ, ఐటి, జ్యుడీషియరీ లాంటి వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని తన మాట వినని ఇతర పార్టీల నాయకులను మోదీ జైలుకు పంపిస్తున్నాడని అన్నారు. మరోవైపు మోదీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక నేరగాళ్లు పెరిగిపోయారని, 2014 నుండి పదేళ్ల కాలంలో 29 మంది ఆర్థిక నేరగాళ్లు పది లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని అన్నారు. ఈ ఆర్థిక నేరగాళ్లలో ముస్లింలు ఎవరూ లేరని అన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ హోల్ సేల్ గా అమ్మకానికి పెట్టాడని, మోడీ హయాంలో అంబానీ, ఆదానీ ప్రపంచ కుబేరులుగా మారారని అన్నారు. కాంగ్రెస్ వస్తే మంగళ సూత్రాలు మిగలవని మాట్లాడే హక్కు మోదీకి లేదని, తన భార్య మంగళ సూత్రాలనే గౌరవించని మోదీకి ఇతరుల గురించి ఎందుకని ప్రశ్నించారు.

– కెసిఆర్ మోదీకి చీకటి ఒప్పందం

మోదీ తో చీకటి దోస్తానా వల్లనే రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోయారని, కమ్యూనిస్టులను దూరం పెట్టి కేసీఆర్ ప్రజలకు దూరం అయ్యారని అన్నారు. కేసీఆర్ నయవంచకుడని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసగించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల తరువాత బీజేపీ లో చేరతారని తలకాయ ఉన్న వారెవరూ మాట్లాడరని అన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి ఓటు వేస్తే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని చెప్పారు. కేసీఆర్ విశ్వాస ఘాతకానికి నిదర్శనం అని,కమ్యూనిస్టులను మోసం చేసిన కేసీఆర్ ఇక లేవలేడని చెప్పారు. గతంలో సీపీఐకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేనూ లాక్కున్నాడని, మునుగోడు ఉప ఎన్నికలలో తాము మద్దతు ఇచ్చినా మోసం చేశారని విమర్శించారు.

అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్లే నిలబడ్డా
—- లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య

వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మహిళ గా 40 ఏళ్ల తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే పోటీ చేసే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని మోడీ మారుస్తామని అంటున్నారని, అందుకే బీజేపీ అధికారంలోకి రావద్దని అన్నారు. కేయూలో నిన్న జరిగిన మేధావులు రచయితల సభపై మతోన్మాద శక్తులు దాడి చేశారని, రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి అంతటా ఎదురవుతుందని అన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, బి. విజయ సారథి, టి.వెంకట్రాములు,టి.విశ్వేశ్వర రావు, జిల్లాల కార్యదర్శులు సి హెచ్ రాజారెడ్డి, కె. రాజ్ కుమార్, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, నాయకులు పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్ ,మండ సదాలక్ష్మి,ఎన్.అశోక్ స్టాలిన్, బీఆర్ లెనిన్, పి. సుగుణమ్మ, షేక్ బాష్ మియా, మద్దెల ఎల్లేష్, పనాస ప్రసాద్, బుస్సా రవీందర్ దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Latest News