విధాత : కూతురి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన తండ్రి, సోదరుడు అబ్బాయి కుటుంబంపై దాడి చేసి..అంతటితో ఆగకుండా వారి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన వైరల్ గా మారింది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ పాటిల్క్రాంతికుమార్ కథనం మేరకు ఝరాసంగం మండలం కక్కర్ వాడ గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కూతురు అదే గ్రామానికి చెందిన బోయిని నగేశ్ తో ప్రేమలో పడింది. తమ ప్రేమ విషయాన్ని కూతురు తన తండ్రికి చెప్పగా.. ఆయన వారి పెళ్లికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి .. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది.
ఈ విషయం ఆమె తండ్రి గొల్ల విఠల్‌కు తెలియడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి అబ్బాయి నగేష్ తండ్రి పై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇంటి దగ్గరకు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. ఈ సంఘటనపై బాధిత యువకుడు నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రీకొడుకులపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
