Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శాలిబండలోని లాల్ దర్వాజ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి.. పక్కనున్న షాపులకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనం కాగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. షోరూమ్ ముందు నిలిపి ఉంచిన కారు కూడా పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసింది. పది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి షోరూమ్‌లోని రిఫ్రిజిరేటర్ల సిలిండర్లు పేలిపోవడంతో భయంకరమైన శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఎగిసిపడుతుండడం, మరోవైపు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఘటనా స్థలాన్ని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్, ఛత్రినాక ఏసీపీ చంద్రశేఖర్ పరిశీలించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
