Glass Bridge | తెలంగాణ( Telangana ) అంటేనే ఎన్నో చారిత్రక కట్టడాలకు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. అంతేకాదు.. పర్యాటకానికి( Tourism ) కూడా ఎంతో ఫేమస్. ఎన్నో రిజర్వాయర్లు, దట్టమైన అటవీ ప్రాంతాలు, జలపాతాలకు( Water falls ) కూడా ప్రసిద్ధి. ఈ పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అటు పర్యాటకులకు, ఇటు ప్రేమికులకు( Lovers ) హాట్ స్పాట్‌గా మారాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లకు కూడా చిరునామాగా మారిపోయాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటకులు, ప్రేమికులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారగా.. ఆ ప్రాంతాల సరసన మరో పర్యాటక ప్రాంతం కూడా చేరిపోయింది.
హైదరాబాద్‌కు సమీపంలోని సిద్దిపేట జిల్లా( Siddipet District )లోని ఎల్లమ్మ చెరువు( Yellamma Cheruvu ).. ప్రేమికుల హాట్‌స్పాట్‌గా మారనుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద హృదయాకారంలో గ్లాస్ బ్రిడ్జి( Glass Bridge )ని నిర్మించారు. ఇలాంటి బ్రిడ్జి తెలంగాణలోనే మొట్టమొదటిది. హృదయాకారంలో నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి ప్రేమికులను, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హృదయాకారంలో ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జి.. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ప్రారంభానికి ముందే ఈ బ్రిడ్జిని పర్యాటకులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి వైరల్ చేస్తున్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు కూడా పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు, 150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీన్ని రూపొందిస్తున్నారు. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొన్నారు. తొలి గ్లాస్ బ్రిడ్జి కావడంతో పనులు పూర్తి కాకముందే చూడటానికి ప్రజలు విచ్చేస్తున్నారు.
