Carrot Halwa | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటళ్లల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల తనిఖీల్లో పాడై పోయిన ఆహార పదార్థాలు వెలుగు చూస్తున్నాయి. ఆ దృశ్యాలను చూస్తే హోటల్స్‌లో ఏం తినకూడదు అనే భావన తప్పకుండా కలుగుతుంది. భోజన ప్రియుల జీవితాలతో చెలగాటమాడుతున్నారా..? అనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే లక్డీకాపూల్‌లోని ద్వారకా హోటల్‌లో కూడా పాడై పోయిన ఆహార పదార్థాలను సరఫరా చేసినట్లు బయటపడింది. కే సరస్వతి(35) అనే మహిళ తన భర్తతో కలిసి మే 23వ తేదీన సాయంత్రం 3.40 గంటల సమయంలో లక్డీకాపూల్‌లోని ద్వారకా హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసిన తర్వాత క్యారెట్ హల్వా, మూంగ్ దాల్ హల్వా ఆర్డర్ చేశారు. హల్వా తిన్న తర్వాత అది కాస్త దుర్వాసన వచ్చింది. దీంతో హోటల్ మేనేజ్‌మెంట్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. కానీ మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు.
సరస్వతి తన వెంట క్యారెట్ హల్వా తెచ్చుకుంది. ఇంట్లో దాన్ని ఓపెన్ చేసి తిందామని నోట్లో పెట్టుకునేసరికి అది కూడా దుర్వాసన వచ్చింది. వాంతులు కూడా అయ్యాయి. విరేచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడింది. క్యారెట్ హల్వా తిన్న తర్వాత తాను వాంతులు, విరేచనాలకు గురయ్యాయని హాస్పిటల్ ఖర్చులు భరించాలని బాధితురాలు హోటల్ మేనేజ్‌మెంట్‌ను అడిగింది. మేనేజ్‌మెంట్ నుంచి స్పందన లేకపోవడంతో.. చేసేదేమీ లేక ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.