ఆ సీటు చాలా హాట్ గురూ !

ఎవరన్నా జీతం తీసుకుని పనిచేస్తారు. కానీ.. ఆ ఆఫీసర్‌ మాత్రం జీతం తీసుకోకుండానే జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు! అయితే.. జీతం కంటే ‘గీతం’ బాగా అందుతుండటం వల్లే ఇక్కడ ఇలా కొనసాగుతున్నారన్న విమర్శలు జీహెచ్‌ఎంసీ

  • Publish Date - April 25, 2024 / 07:30 PM IST

– రెండేండ్లుగా జీతం లేకుండా పని చేస్తున్న ‘ఆఫీసర్‌’
– నకిలీ జనన, మరణ ధృవీకరణ పత్రాల రికవరీలో విఫలం
– కింది స్థాయి సిబ్బందిపై అజమాయిషీ
– ఆపరేటర్ల నియామకంలోను చేతివాటం
– ఉన్నతాధికారి కనుసన్నల్లోనే వ్యవహారం?
హైదరాబాద్‌: ఎవరన్నా జీతం తీసుకుని పనిచేస్తారు. కానీ.. ఆ ఆఫీసర్‌ మాత్రం జీతం తీసుకోకుండానే జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు! అయితే.. జీతం కంటే ‘గీతం’ బాగా అందుతుండటం వల్లే ఇక్కడ ఇలా కొనసాగుతున్నారన్న విమర్శలు జీహెచ్‌ఎంసీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. డిప్యూటేషన్ మీద వచ్చి.. తన హోదాకు మించి బాధ్యతలు నిర్వహిస్తూ సర్కిల్ కార్యాలయాల్లో కింది స్థాయి సిబ్బందిపై బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు వచ్చే జీతం తీసుకోకుండా, రాకపోయినా బల్దియా కోసం కష్టపడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తనకు తాను సాటిస్టిక్స్‌ ఆఫీసర్‌ను అని చెప్పుకొంటూ.. సిబ్బందిపై అజమాయిషీ చేయడంతోపాటు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నయి. విభాగం ఉన్నతాధికారి ఒకరి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్ పరిధిలో పుట్టిన, చనిపోయిన వారి వివరాలు రికార్డు చేసి, భద్రపరిచి వాటిని సరైన టైంలో అవసరమైన విభాగాలకు అందించడంతోపాటు ధ్రువపత్రాలను కూడా ఈ విభాగం జారీ చేయాల్సి ఉంటుంది. ఏ ఏ కారణం చేత ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమంది చనిపోతున్నారు? సాధారణంగా చనిపోతున్నవారు ఎంతమంది అనే వివరాలను సేకరించి, ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్లు.. రిజిస్ట్రార్‌ నుంచి పూర్తి వివరాలను తీసుకున్న ప్రధాన కార్యాలయం వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మరణాలకు కారణాలను ప్రభుత్వం విశ్లేషించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారిస్తుంటుంది.

అయితే ఎక్కడా స్టాటిస్టికల్ అధికారులు అలాంటి పనులు జీహెచ్‌ఎంసీలో చేయడం లేదనే వాదన వినిపిస్తున్నది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ స్టాటస్టికల్ విభాగంలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న ‘ఆఫీసర్‌’.. వాస్తవానికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కలిగి ఉన్నప్పటికీ.. జీహెచ్ఎంసీ జనన మరణ ధ్రువీకరణ విభాగంలో అంతా తానే అంటూ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో చేపట్టిన ఇన్‌స్టంట్‌ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరిగి, 25 వేలకు పైగా అక్రమంగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. వాటిపై ఎంక్వయిరీ చేసిన అధికారులు వాటిని తొలగించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సర్టిఫికెట్ల రికవరీ చేయడంలో విఫలం
రెండు నెలల క్రితం ఫలక్‌నుమా సర్కిల్‌లో అక్రమంగా జారీచేసిన వందకు పైగా బర్త్ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు. ఈ అంశంపై పెద్ద దుమారం లేవడంతో అక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించి, కేసు నమోదు చేశారు. ఫలక్‌నుమా సర్కిల్ పరిధిలో జారీ అయిన అక్రమ సర్టిఫికెట్లను రికవరీ చేయడంలో మాత్రం అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బర్త్ సర్టిఫికెట్లతో పాస్‌పోర్టులు పొందడంతో పాటు.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వంటి అనేక ధృవపత్రాలను పొందేందుకు అవకాశం ఉన్నది. ఇక డెత్ సర్టిఫికెట్లు ఆస్తుల మార్పిడికి, ఇన్సూరెన్స్ కవరేజీలకు అక్రమార్కులు ఉపయోగిస్తుంటారు. జీహెచ్‌ఎంసీ స్వయంగా జారీ చేసిన పత్రాలను నోటీసులు జారీ చేసి తీసుకోవచ్చు. కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా చెప్పుకొంటున్న సదరు ‘ఆఫీసర్‌’ మాత్రం ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో అనుమానాలకు తావిస్తున్నది.

జీతం లేకుండానే రెండేళ్లుగా..
జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా ఉన్న సదరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి జీతం తక్కువగా ఉందని సమాచారం. ఆ జీతం కూడా నెలనెలా తీసుకోకుండా రెండు సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

హెల్త్ సెక్షన్ లో అన్నీ తానై..
ఆసుపత్రులకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఇవ్వాల్సిన అనుమతులను క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ప్రధాన కార్యాలయం నుండి క్లియర్ చేస్తున్నారు. ఇందులో చీఫ్ మెడికల్ ఆఫీసర్ తోపాటు స్టాటిస్టికల్ అధికారిగా వ్యవహరిస్తున్న ‘ఆఫీసర్‌’ కీలక పాత్ర వహిస్తున్నారు. గతంలో ఆసుపత్రులకు లాగిన్ ఐడీలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో ఉన్న రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు పరిశీలించి రిపోర్టులు పంపితే వాటి ఆధారంగా లాగిన్ ఐడీ ప్రధాన కార్యాలయం నుండి జారీ అయ్యేది. ఇప్పుడు అంతా అందుకు భిన్నంగా జరుగుతున్నదని చెబుతున్నారు. ఇక జీహెచ్‌ఎంసీ బర్త్ అండ్ డెత్ విభాగంలో పనిచేసే క్షేత్రస్థాయి అధికారులపై సిబ్బందిపై ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం ప్రధాన కార్యాలయం అధికారులకు పరిపాటి అయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. సదరు ‘ఆఫీసర్‌’ తన కిందిస్థాయి సిబ్బందిపై నిత్యం బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తాను తలుచుకుంటే సాయంత్రానికి ఇంటికి పంపుతానంటూ తాను చెప్పిన పనులు చేయాలంటూ బెదిరిస్తున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. మీవి తుమ్మితే ఊడిపోయే ముక్కులంటూ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సైతం వేధిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి వేధింపులను తట్టుకోలేక పలువురు ఆపరేటర్లు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. దాంతో కొత్త ఉద్యోగులను నియమించుకోవడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఒకటి రెండేళ్లుగా నియమించిన పలువురు ఆపరేటర్లనుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest News