Site icon vidhaatha

Outsourcing Employees | 16,448 మంది ఔట్‌సోర్సింగ్‌ వైద్య ఉద్యోగులకు గుడ్ న్యూస్

Outsourcing Employees | విధాత, హైదరాబాద్ : తాత్కాలిక, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనం విధానంలో ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న వారి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెనకబడి ఉంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరుతో కాంట్రాక్టు అగ్రిమెంట్ ముగుస్తుంది. మళ్లీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో ఏడాది పాటు పని చేసుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ బడ్జెట్ మంజూరు చేస్తుంది. బడ్జెట్ మంజూరులో ఆర్థిక శాఖ మూడు నెలల నుంచి తాత్సారం చేస్తున్నది. వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఒత్తిడి మేరకు మరో ఏడాది పాటు బడ్జెట్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయంతో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్, గౌరవ వేతనం విధానంలో పనిచేస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) విభాగంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, హానరోరియం, మల్టీ టాస్కింగ్‌ విధానంలో పనిచేస్తోన్న 16,448వేల మంది ఉద్యోగుల పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈ పరిధిలో రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో 4,772 మంది, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో 8,615 మంది, హానరోరియమ్‌ పోస్టుల్లో 3,056 మంది, ఎంటీఎస్‌ విధానంలో ఐదుగురు పనిచేస్తున్నారు. మొత్తం 16,448 మంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు, నర్సింగ్, డెంటల్ కాలేజీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంలో వారందరికి మరో ఏడాది పాటు ఉద్యోగ భద్రత భరోసా కల్గింది. వీరిలో టీచింగ్ ఫ్యాకల్టీ సహా.. నర్సింగ్‌, పారామెడికల్ సిబ్బంది, డీఈఓలు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు.

డీఎంఈ విభాగంలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ పొడిగింపు కాలం ఆదేశాలు 2026 మార్చి 31వరకు కొనసాగనున్నాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కాంట్రాక్టు ఏజెన్సీలు, మిగతా విభాగాల వారికి ప్రభుత్వం నుంచి నేరుగా వేతనాలు చెల్లిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ మాదిరిగి మిగతా ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించడంతో పాటు బడ్జెట్ మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. రెండు నెలల నుంచి వీరికి వేతనాలు ఇవ్వడం లేదని, అదేమని అడిగితే సంఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ లో ఉన్న ఉద్యోగులను కొనసాగించకుండా ఇంటికి పంపించే కార్యక్రమం మొదలు పెట్టిందని, దీనికంతటికీ ఆర్థిక శాఖ కారణమని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Outsourcing Employees | 74 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఊస్టింగ్! మిగులు సిబ్బంది పేరుతో తొలగింపు?
Outsourcing Employees | తొందరేముంది.. చూద్దాంలే! ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలపై డిప్యూటీ సీఎం నాన్చుడు?
Outsourcing Employees | తెలంగాణలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల‌కు సర్కారీ మేత.. ఇదిగో లెక్క!
Outsourcing Agencies | తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిలువు దోపిడీ?

Exit mobile version