TDR | టీడీఆర్‌ను పూర్తిగా ర‌ద్దు చేయండి.. గ్రేటర్ హైదరాబాద్ రియల్టర్ల డిమాండ్

TDR | మార్కెట్ కు ఊపునిచ్చే విధంగా TDR సవరణలు రాలేదని, జీఓను పూర్తిగా సంస్కరించాలని రియల్టర్లు కోరుతున్నారు. మూసీ ప్రక్షాళన, నెహ్రూ ఓఆర్ఆర్ పరిధిలో రియల్టీకి పరుగులు పెట్టించాలంటే నిర్బంధ టీడీఆర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు.

TDR | విధాత, హైదరాబాద్ : తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ (టీడీఆర్) విషయంలో ప్రభుత్వం స్వల్ప ఊరటనిచ్చిందని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మార్కెట్ కు ఊపునిచ్చే విధంగా సవరణలు రాలేదని, జీఓను పూర్తిగా సంస్కరించాలని రియల్టర్లు కోరుతున్నారు. మూసీ ప్రక్షాళన, నెహ్రూ ఓఆర్ఆర్ పరిధిలో రియల్టీకి పరుగులు పెట్టించాలంటే నిర్బంధ టీడీఆర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు.

టీడీఆర్ కఠిన నిబంధనలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్ మెంట్ విభాగం జీఓఎంఎస్ నెంబర్ 95 (తేదీ 21-03-2026) లో కొన్ని సవరణలు చేస్తూ జారీ చేసింది. టీడీఆర్ వినియోగం, భవన నియమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 21 మీటర్ల ఎత్తు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాన్ని హై-రైజ్ భవనం అంటారు. ఇందులో పారిశ్రామిక భవనాల్లో చిమ్నీలు, కూలింగ్ టవర్స్, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు వంటి నాన్-వర్కింగ్ ఏరియాలకు మినహాయింపు ఇచ్చారు. 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల స్థలాలకు 18 మీటర్ల నుంచి21 మీటర్ల ఎత్తు భవనాలు టీడీఆర్ వినియోగంతో మాత్రమే అనుమతిస్తారు. హై-రైజ్ భవనాలలో సెట్ బ్యాక్ లో 10 శాతం వరకు సడలింపు టీడీఆర్ ద్వారా ఉంటుంది కానీ కనీసం 7 మీటర్లు సెట్ బ్యాక్ తప్పనిసరి చేశారు. నాన్-హై-రైజ్ భవనాలలో రోడ్డు విస్తరించిన సందర్భంలో కనీస సెట్ బ్యాక్ పాటించినప్పుడు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ లో సడలింపు కల్పించారు.

టీడీఆర్ తో సంబంధం లేకుండా అనుమతులు

మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లలో ఇరుకుగా లేదా విస్తరించిన సందర్భంలో డెవలప్ మెంట్, మార్పిడి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సమానమైన టీడీఆర్ సమర్పించుకోవచ్చు. 2,000 చదరపు మీటర్లకు పైగా ఉన్న స్థలాలకు 40 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ ఉన్నట్లయితే అదనంగా మూడు అంతస్తులు, 60 ఫీట్ల రోడ్డు లో 4 అదనపు అంతస్తులు, 80 ఫీట్ల రోడ్డులో 5 అదనపు అంతస్తులు టీడీఆర్ ద్వారా లభిస్తుంది. ఫైర్ సేఫ్టీ, ఏయిర్ పోర్టు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 10 నుంచి 20 అంతస్తులు నిర్మాణం చేసే వారు 10 అంతస్తుల పైభాగంలో మొత్తం బిల్టప్ ఏరియాలో 3 టీడీఆర్ వినియోగించాల్సి ఉంటుంది. 20 అంతస్తుల పైభాగంలో మొత్తం బిల్టప్ ఏరియాలో 5 శాతం టీడీఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు భవన నిర్మాణం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో వంద శాతం టీడీఆర్ కొనుగోలు చేయాలని నిబంధన విధించారు. ఇప్పుడా నిబంధనల్లో స్వల్ప స్థాయిలో సవరణలు చేశారు. భవనానికి అనుమతులు ఇచ్చిన సమయంలో 50 శాతం టీడీఆర్, అక్యుపెన్షీ సర్టిఫికేట్ జారీ సమయంలో మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పించాలని షరతు విధించారు. ఈ నిబంధనలు కూడా తొలగించి పాత పద్దతిలో టీడీఆర్ తో సంబంధం లేకుండా అనుమతులు ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అదనపు అంతస్తులు కావాలనుకునే వారు ఆ సమయంలో టీడీఆర్ తీసుకునే విధంగా నిబంధనలు మార్చాలని ముక్తకంఠంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.

ఇతర నగరాల్లో పర్యటించి ఏం సాధించారు

రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవన నిర్మాణం సమయంలో టీడీఆర్ సమర్పించాలనే నిబంధన చేర్చుతూ ఇటీవల మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్ మెంట్ విభాగం జీఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద సంస్థలు ముందుకు రాకపోవడం, వేలం పాటలో ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన సంస్థల నుంచి అభ్యంతరాలు రావడంతో ముఖ్యమంత్రి పునరాలోచనలో పడ్డట్టు వార్తలొచ్చాయి. రాష్ట్ర ఆదాయంలో కీలక భూమిక ఉన్న రియల్ ఎస్టేట్ పై టీడీఆర్ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఇతర నగరాలలో టీడీఆర్ ఎలా అమలు అవుతుందో తెలుసుకుని నివేదిక అందచేయాలని మున్సిపల్ విభాగాన్ని ఆదేశించి, రెండు మూడు నగరాలలో పర్యటించి నివేదిక అందచేశారు. ఆ నివేదికలోని అంశాలు పరిశీలించారో లేదో తెలియదు కాని, స్వల్ప మార్పులు చేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 95 జారీ చేశారు. ఇతర నగరాల్లో పర్యటించి నివేదిక రూపొందించి ఏం సాధించారంటూ రియల్ ఎస్టేట్ వర్గాలు నిట్టూర్చుతున్నాయి. మూసీ ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ, ట్రిఫుల్ ఆర్ నిర్మాణం చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీఆర్ నిబంధనలు పూర్తిగా రద్ధు చేస్తేనే బాగుంటుందని ఆ వర్గాలు కోరుతున్నాయి.

Latest News