Hyderabad Rainfall Alert | విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరవ్యాప్తంగా సోమవారం సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ శాఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు కీలకమైన అడ్వైజరీ జారీ చేసింది. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3:00 గం. నుంచి లాగౌట్స్ ప్రారంభించాలని సూచింది. విడతల వారీగా లాగౌట్స్ చేస్తే, నగరంలో ట్రాఫిక్‌ని నియంత్రించగలుగుతామని పోలీస్ శాఖ పేర్కొంది. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని నగరవాసులకు సూచించింది. ఇప్పటికే ఐటీ కంపనీలకు ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం అవకాశమివ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం.
ఈనెల 13 నుంచి 17 వరకు అతిభారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13నుంచి 16వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్రంలో హైదరాబాద్ లోనూ ఒకట్రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిత తెలిపింది. ఆగస్టు 15న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ రోజు, రేపు తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
ఆగస్టు 13 నుంచి 16వ తేదీ వరకు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇవ్వాలని ఐటి కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.