Site icon vidhaatha

పాలమూరులో ప్రచారం షురూ


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గంలో ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులు శనివారం ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం హన్వాడ మండలంలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు పేదలకు అందవని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. బోనాలతో, గంగిరెద్దులతో ఆయనకు స్వాగతం పలుకుతూ స్థానికులు అభిమానాన్ని చాటుకుంటున్నారు.



పాలమూరు పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చేపట్టారు. పార్టీ ఆరు గ్యారంటీ పథరాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే గ్యాస్ ధర తగ్గిస్తామని, రూ.2 లక్షల రైతు రుణమాఫీపై ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి పాలమూరుకు వచ్చి బీజేపీ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. తండ్రి జితేందర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు ప్రచారంలోకి దిగడంతో పాలమూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది.


Exit mobile version