విధాత, హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు చెప్పారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి రైతు జేఏసీ బృందం సభ్యులను కేటీఆర్ హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ రైతులతో మాట్లాడుతూ ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
రైతుల ముందే మరోసారి డిటిసిపి అధికారులతో మాట్లాడిన కేటీఆర్… ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు.
మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్ కు రైతు జేఏసీ బృందం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటీఆర్ హామీపై పూర్తి భరోసా ఉందని చెప్పారు. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కేటీఆర్ స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు.