Kalvakuntla kavitha : తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

తుపాన్ వర్షాలతో దెబ్బతిన్న రైతుల తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

Kalvakuntla kavitha : తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి

విధాత : మొంథా తుపాన్ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటనలో భాగంగా మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయకపోవడంతో వర్షాలకు తడిసిపోయి రైతులు మరింత నష్టపోయారని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించి తడిసిన ధాన్యం కొనుగోలు జరిపించాలని డిమాండ్ చేశారు. తుపాన్ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. పదివేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదు అని, రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదు. ప్రభుత్వం, కలెక్టర్, అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వెంటనే పంట నష్టం సర్వే చేసి నివేదికలు ఇచ్చి రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వం ఆదేశించాలన్నారు.

నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం మొలకలు వస్తుందని, ఇలాంటి సందర్భంలో తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండాలని మిల్లర్లు కండిషన్లు పెడుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని కవిత తెలిపారు. అసలు ఐకేపీ సెంటర్లు లేకుండా డైరెక్ట్ గా ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారన్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్లేందుకు రైతులకు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. తేమ శాతం ఎక్కువ ఉన్న, బూజు పట్టిన, మొలకలు వచ్చిన సరే ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరారు. భూమి దస్తావేజులు లేవంటూ కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టటం సరికాదు. వారి ధాన్యం కొనేలా వెసులుబాటు ఇవ్వండని డిమాండ్ చేశారు.