Site icon vidhaatha

Kavitha Quits | బీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా – హరీశ్‌, సంతోష్‌పై తీవ్ర ఆరోపణలు

Kalvakuntla Kavitha resigns as MLC and from BRS party primary membership

హైదరాబాద్‌:

Kavitha Quits | బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లను నేరుగా లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆధారాలు లేకుండా ఆరోపణలు

కవిత మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు గంభీరంగా వినిపించినప్పటికీ, అవి ప్రధానంగా ఆరోపణలకే పరిమితమయ్యాయి. హరీశ్‌రావు కాంగ్రెస్‌, బీజేపీలతో కుమ్మక్కై బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచారని, సంతోష్‌ నకిలీ కార్యక్రమాలకు పాల్పడి పార్టీకి నష్టం కలిగించారని ఆమె ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాలు లేదా ఆధారాలు చూపకపోవడం గమనార్హం.

తాను గతంలో ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడానని, పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని కవిత చెప్పినా, ఆమె వ్యాఖ్యలపై విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నిజామాబాద్‌, కామారెడ్డిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు తాను బలి అయిపోయానని చెప్పడం బాధ్యత రాహిత్యమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

హరీశ్‌రావు, సంతోష్‌పై ఆరోపణలు

కవిత తన ప్రసంగంలో హరీశ్‌రావును తీవ్రంగారం విమర్శించారు. ఆయనను “ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్” అని వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు అదనపు నిధులిచ్చి అవినీతికి కారణమయ్యారని ఆరోపించారు. అంతేకాదు, కాంగ్రెస్ నేతలతో, ముఖ్యంగా ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు కుమ్మక్కై పనిచేశారని, ఆయనతో ఒకే విమానంలో ప్రయాణించారని చెప్పారు. బీఆర్‌ఎస్‌‌లో అంతర్గతంగా ఉన్న సమస్యలకు హరీశ్‌రావే ప్రధాన కారణమని కవిత స్పష్టం చేశారు. మాజీ ఎంపీ సంతోష్‌పై కూడా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధిక ధనదాహంతో ఆయన నకిలీ కార్యక్రమాలను నడిపారని, ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ పేరిట ప్రజలను, సినీ నటులను మోసగించారని ఆరోపించారు. సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేయడానికి సంతోషే బాధ్యుడని అన్నారు. బీఆర్‌ఎస్‌ పరాజయాల్లో కూడా సంతోష్‌ పాత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. కవిత తన వ్యాఖ్యల్లో పార్టీ వ్యవహారాలకు తోడు కుటుంబ విషయాలను కూడా ప్రస్తావించారు. “మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం వస్తుంది” అంటూ తన తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌లకు జాగ్రత్తలు సూచించారు. ఈ వ్యాఖ్యలు వాస్తవ సమస్యలను పక్కనబెట్టి కుటుంబ సెంటిమెంట్​ను అడ్డంపెట్టుకున్నట్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్‌ఎస్‌లో ప్రతిస్పందనలు

కవిత చేసిన ఆరోపణలు బీఆర్‌ఎస్‌ లోపల చర్చకు దారితీసినప్పటికీ, వాటిని పార్టీ వర్గాలు పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. పార్టీ లోపల ఉన్నవారు ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత పరాజయాలపై ఆత్మరక్షణ ప్రయత్నంగానే చూస్తున్నారని సమాచారం. ముఖ్యంగా వరుస ఎన్నికల్లో గెలవలేకపోయిన తర్వాత కవిత ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నారని, ఒకరకంగా కవిత రాజీనామ బీఆర్​ఎస్​కు మంచిదే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్​ఎస్​కు ఇప్పటిదాకా ఉన్న “దిష్టి తొలగిపోయింద”ని  ఒక  సీనియర్​ విశ్లేషకుడు వ్యాఖ్యానించడం విశేషం. కూతురైనా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కేసీఆర్​ ఈ సందర్భంగా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె రాజీనామా పార్టీపై ప్రభావం చూపదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్ కార్యాచరణపై అనిశ్చితి

తాను ఏ ఇతర పార్టీలోనూ చేరబోనని, రెండు రోజుల్లో విశ్రాంతి తీసుకుని భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని కవిత తెలిపారు. అయితే ఆమె తదుపరి అడుగులు స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కవిత ఒక కొత్త పార్టీ పెడుతుందని అని భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత రాజీనామా రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించినప్పటికీ, ఆమె ఆరోపణలు ఆధారరహితమన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ నిర్ణయం ఆమె వ్యక్తిగత బలహీనతను మాత్రమే ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇకనుంచీ కవిత చేసిన అవినీతి, అక్రమ సంపాదనలు బయటపడతాయని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.

Exit mobile version