- రిజర్వేషన్ల పెంపును స్వాగతించిన ఎమ్మెల్సీ కవిత సంబురాలు
- బీసీలకు ద్రోహం చేసేందుకు కాంగ్రెస్ కుట్రగా అభివర్ణించిన పార్టీ నేతలు
- 42 శాతం రిజర్వేషన్లు స్వాగతించినట్లా.. వ్యతిరేకించినట్లా?
- నిర్ణయాన్ని వెల్లడించని కేసీఆర్..అయోమయంలో క్యాడర్
హైదరాబాద్, జూలై12(విధాత): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్‌ను అయోమయానికి గురి చేసింది. స్వాగతించాలో.. వ్యతిరేకించాలో అర్థం కానీస్థితిలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఉన్నది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతరు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మాత్రం రేవంత్ సర్కారు రిజర్వేషన్లు పెంచుతూ పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలని తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇది తమ పోరాట విజయంగా ఆమె ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తన నివాసంలో జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. రేవంత్ సర్కారు నిర్ణయాన్నిస్వాగతిస్తున్నట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయాన్ని బీసీలకు చేసిన ద్రోహంగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణంచారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, పార్టీ నేత దాసోజు శ్రావణ్‌లు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. కనీసం రిజర్వేషన్లు పెంచాలని మంత్రి వర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని మాట వరుసకు కూడా స్వాగతించలేదు. ఇప్పటికే ఢిల్లీకి పంపించిన బిల్లును బైపాస్ చేసేందుకేనని వారు ఆరోపించారు. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి 20 నెలల సమయం పట్టిందా అని ఎద్దేవా చేశారు. ఇంతటితో ఆగని బీఆర్ఎస్ నేతలు కోర్టులు కొట్టి వేస్తాయని రేవంత్‌కు తెలుసు కాబట్టే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించారని జోష్యం కూడా చెప్పారు. ఇలా బీఆర్ఎస్ నేతలు రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని తప్పు పడితే.. అధినేత కేసీఆర్ కూతురు రేవంత్ నిర్ణయాన్ని స్వాగతించారు. కాగా రేవంత్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ విద్యార్థి సంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్, స్పోర్ అథారిటీ మాజీ చైర్మన్ ఈడిగ ఆంజనేయ గౌడ్‌లు ధర్నా నిర్వహించం కొసమెరుపు.
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీలో భిన్న స్వరాలు వెలువడడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్న నిర్ణయం బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం చేస్తుందని, కాంగ్రెస్‌కు లబ్ది కలుగుతుందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టి క్యాడర్, క్షేత్ర స్థాయినాయకులు ఏ నిర్ణయం తీసుకొని మాట్లాడాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఇంతకు పార్టీ రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించినట్లా… లేక వ్యతిరేకించినట్లా అర్థం కావడం లేదని పార్టీ క్షేత్ర స్థాయి నాయకుడొకరు అన్నారు. పార్టీలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితి నుంచి క్యాడర్ను బయట పడేసి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అగ్రనేత కేసీఆర్ స్పంధించడం లేదు. దీంతో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో స్థానిక నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.