సత్యం గెలిచిందన్న కేజ్రీవాల్, కవిత
ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై కేజ్రీవాల్, కవిత భావోద్వేగానికి గురయ్యారు. “సత్యం గెలిచింది” అంటూ కోర్టు నిర్ణయం తమ నిజాయితీని నిరూపించిందని పేర్కొన్నారు.
విధాత : ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేస్తూ..నిందితులందరిని విడుడల చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియా, కవిత సహా బాధితులు భావోద్వేగానికి గురయ్యారు. సత్యం గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అధికారం కోసం ప్రభుత్వాలను కూల్చవద్దని ఈసందర్భంగా ప్రధాని మోదీని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి ఆప్‌ను అంతం చేయడానికి.. పెద్ద రాజకీయ కుట్రే పన్నారు అని ఆరోపించారు. మా పార్టీలోని ఐదుగురు కీలక నేతలను జైల్లో పెట్టారు. సీఎంగా ఉన్న నన్ను కూడా జైలులో పెట్టారు అని గుర్తు చేశారు. నేను అవినీతిపరుడిని కాదు అని మొదటి నుంచి చెబుతున్నానని, ఇప్పుడు కోర్టు కూడా అదే పేర్కొంది అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.తాజాగా కోర్టు తీర్పుతో తమ నిజాయతీ నిరూపితమైందన్నారు.
ఈ క్రమంలో భావోద్వేగంతో ఆయన కన్నీళ్లు పెట్టుకోగా.. పక్కనే ఉన్న సిసోదియా కేజ్రీవాల్‌ను ఓదార్చారు. కోర్టు తీర్పుపై కేజ్రీవాల్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఆయనను నివాసంలోకి ఆహ్వానిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను చూడగానే కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు.
చెప్పినట్లుగానే నిజం నిరూపితమైంది : కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో తన నిజాయితీ నిరూపితమైందని, న్యాయ వ్యవస్థపై నాకున్న నమ్మకాన్ని ఈ తీర్పు నిజం చేసింది అని, నాపై నోరు జారినవారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తీర్పుపై ఆమె మీడియాతో మాట్లాడారు. నేను ఏ తప్పు చేయలేదు అని, కడిగిన ముత్యంలా వస్తానని చెప్పాను అని, ఇప్పుడు అలాగే వచ్చాను అని స్పష్టం చేశారు. కేసీఆర్ పైన రాజకీయ కక్షతో నాపై కేసు పెట్టారని చెప్పిందే నిజమైంది అని, ఈ కేసు వల్ల నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం అన్నారు. కష్ట సమయంలో అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు అని కవిత తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Worlds Tallest Bridge | ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్న జలపాతం.. ఆకట్టుకుంటన్న వీడియో
Real Life Bichagadu | రియల్ లైఫ్ బిచ్చగాడు.. భార్య కోసం బిక్షాటన చేస్తున్న లాయర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram