King Cobra | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరం విషపూరిత సర్పం కింగ్ కోబ్రా( King Cobra )తో పాటు ఇండియన్ ర్యాట్ స్నేక్(జెర్రిపోతు)కు హాట్‌స్పాట్‌గా మారింది. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ( FOS ) ప్రతినిధులతో కలిసి హైదరాబాద్‌లోని సీసీఎంబీ( CCMB ) శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పదేండ్ల పాటు జరిపిన ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి.
2013 నుంచి 2022 వరకు పదేండ్ల పాటు నగరంలోని 55 వేల పాములు పట్టుబడగా.. అవి ఎలా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి..? ఎలా బతుకుతున్నాయి..? ఏ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి..? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు.
అయితే హైదరాబాద్ నగరంలో కనిపించే అత్యధిక పాముల్లో నాగుపాము, జెర్రిపోతు ఉన్నాయి. మొత్తం పాముల్లో కెల్లా ఈ రెండు 76 శాతంగా ఉన్నాయి. ఈ రెండు పాములు కూడా నగర వాతావరణానికి బాగా అలవాటు పడిపోయాయి. దీంతో ప్రతి ఏడాది 8 నుంచి 10 శాతం పెరుగుతున్నాయి.
ఏ సమయంలో కనిపిస్తాయి..?
నాగుపాములు, జెర్రిపోతులు.. వర్షాకాలంలోనే బయటకు వస్తాయి. మరి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో బయటకు వస్తుంటాయి. ఎందుకంటే ఆ సమయం సంతానోత్పత్తికి అనుకూలంగా ఉండడంతో పాటు వాతావరణం కూడా వెచ్చగా ఉండడం ఒక కారణం.
హాట్‌స్పాట్లు ఇవే..
నగరం నడిబొడ్డున కూడా పాములు సంచరిస్తున్నాయి. ప్రధానంగా నగర శివార్లలో నాగుపాముల సంచారం అధికంగా ఉంది. ఎందుకంటే.. బహుళ అంతస్తుల భవనాల వల్లే. ఈ భవన నిర్మాణాల వల్ల పాములు తమ ఆవాసాన్ని కోల్పోయి.. జన సంచారంలోకి ప్రవేశిస్తున్నాయి.
పాములు పర్యావరణానికి మంచిదే..
పాములు ఎలుకలను తిని వాటి సంఖ్యను నియంత్రిస్తాయి. ఒకవేళ పాములు లేకపోతే నగరంలో ఎలుకల వల్ల వచ్చే ప్రాణాంతక రోగాలు పెరిగే ముప్పు ఉంది. కాబట్టి, ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్’ (FOS) లాంటి రెస్క్యూ టీమ్స్ సహాయం తీసుకోవడం సురక్షితం.
