KTR vs Bandi Sanjay | 48 గంటల గడువు.. క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకే

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ హోం మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు

హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ హోం మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. సున్నితమైన వ్యవహారంపై బేస్‌లెస్ ఆరోపణలు చేయడం చట్టపరంగా తగదని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చౌకబారు రాజకీయాలకు, దిగజారిన మాటలకు నిదర్శనమని మండిపడ్డారు.

ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమే కాక, ప్రజలను తప్పుదారి పట్టించే కుట్రగా అభివర్ణించారు. కేంద్ర హోంశాఖలో పనిచేస్తూ కూడా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ బండి సంజయ్‌కు 48 గంటల గడువు ఇచ్చారు – తక్షణమే ఆరోపణలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టులో లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే లీగల్ నోటీసు పంపినట్టు కూడా తెలిపారు.

“సాక్ష్యాలు లేకుండా వక్రీకరించిన వాస్తవాలు, బజారు స్థాయి మాటలు ఇక భరించం” అని తేల్చిచెప్పిన కేటీఆర్.. “కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినంత సులువు కాదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సున్నితమైనదో, చట్టపరంగా ఎంత బాధ్యతాయుతమైనదో తెలిసినపుడే ఇలాంటి అంశాలపై మాట్లాడాలి కానీ, బండారం లేని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇకపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు, బజారు స్థాయి మాటలు సహించేది లేదని తేల్చిచెప్పారు.