Site icon vidhaatha

Hyderabad Metro | ఇలాగైతే మెట్రో నడపలేం.. 2026 తర్వాతా విక్రయ నిర్ణయం

మెట్రో మనుగడకు మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ దెబ్బ
ఎల్‌ఆండ్‌టీ సంస్థ ప్రెసిడెంట్ ఆర్‌.శంకర్ రామన్

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో కీలకంగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రెసిడెంట్‌, శాశ్వత డైరెక్టర్‌, సీఎఫ్‌వో ఆర్‌ శంకర్‌ రామన్‌ స్వయంగా ప్రకటించారు. 2026 తర్వాత విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో రైలు నిర్వాహణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి, మెట్రో రైలు అమ్మకానికి ప్రధాన కారణంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పేరిట మహిళలకు అమలు చేస్తున్న ఫ్రీ బస్ స్కీమ్ కారణమని చెప్పడం ఆసక్తిరేపుతుంది.

ఇంగ్లీష్‌ వార్తాఛానల్‌ ‘బిజినెస్‌ టుడే’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోశంకర్ రామన్‌ కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నామని, ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకొన్నది కాదన్నారు. 2026 తర్వాత దీని అమ్మకంపై నిర్ణయం తీసుకుంటామని, ప్రాధాన్యంలేని వ్యాపారాల్లో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకొనే చర్యల్లో భాగంగా ఈ విక్రయం ఉంటుందన్నారు.

మెట్రోరైలు పరుగులకు మహాలక్ష్మి బ్రేక్‌లు

మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ స్కీమ్‌ కారణంగా మెట్రో ఆదాయానికి గండి పడిందని శంకర్ రామన్ పేర్కోన్నారు. అందుకే హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలుగాలనుకొంటున్నామని స్పష్టం చేశారు. ఫ్రీ’ బస్సు స్కీమ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మెట్రోకు వస్తున్న నష్టాలను విశ్లేషించిన తర్వాతే ఈ ఆలోచనకు వచ్చామని తెలిపారు. మెట్రో నిర్వహణకు సంబంధించి మరో 65 ఏండ్ల పాటు మాకు పలు రాయితీలు ఉన్నాయి.

అయినప్పటికీ, నష్టాలను భరించలేకే వైదొలగాలనుకొంటున్నామన్నారు. ఫ్రీ’ బస్సు స్కీమ్‌తో తెలంగాణ ఆర్టీసీ కూడా దివాళా తీసే దుస్థితి రావొచ్చని హెచ్చరించారు. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 4.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, మేం నడుపుతున్న సర్వీసులు, నిర్వహణ వ్యయం, ఇతరత్రా ఖర్చులతో పోలిస్తే, ఈ సంఖ్య సరిపోదన్నారు. దీంతో నష్టాలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

మహిళలు ఒక్క పైసా చెల్లించకుండా బస్సులను ప్రయాణ సాధనంగా వినియోగించుకొంటే, సగటున రూ. 35 టికెట్‌ చెల్లించి పురుషులు మెట్రోల్లో ప్రయాణిస్తున్నారని, ఈ పరిణామం రవాణా వ్యవస్థలో ఒకవిధంగా లింగ పంపిణీకి దారితీస్తున్నదన్నారు. క్యాబ్‌ సర్వీసులు పెరుగడం కూడా మెట్రోపై ప్రభావం చూపిస్తున్నదని విశ్లేషించారు. నిజానికి జనం రద్దీకి తగినట్టు బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచట్లేదని, బస్సుల్లో సీట్లు దొరకని పురుషులు మాత్రమే మెట్రో ఎక్కుతున్నారని, లేడీస్‌ కంపార్ట్‌మెంట్లు అన్నీ దాదాపుగా ఖాళీగానే కనిపిస్తున్నాయన్నారు.

కాలుష్యంలేని, ఆధునిక రవాణా వ్యవస్థలపై (మెట్రో సర్వీసులు) ప్రైవేటు సంస్థలు తమ డబ్బును ఖర్చు పెడుతుంటే.. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న బస్సుల్లో ప్రజలు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం డబ్బును వెదజల్లుతున్నదని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నారు. రాజకీయ వాగ్ధానాలకు లోబడి కొనసాగుతున్న ‘ఫ్రీ’ బస్సు పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏవిధంగానూ ఉపయోగకరంగా ఉండబోదని, ఈ స్కీం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని అప్పుల పాల్చేసి దివాళా తీసేలా చేస్తుందని, నిజానికి బస్సులకు ప్రతీ 5 ఏండ్లకు ఒకసారి మరమ్మతులు చేయాల్సి ఉంటుందని, ‘ఫ్రీ’ ప్రయాణాన్ని కల్పించుకొంటూ పోతుంటే సిబ్బంది జీతభత్యాలతో పాటు బస్సుల మెయింటెనెన్స్‌కు డబ్బులు సమకూరడం ప్రశ్నార్ధకమేనన్నారు.

మెట్రో ఆగితే హైదరాబాద్ ప్రగతికి ఆటంకం ?

దేశంలో తొలి మెట్రో నడిచిన 33 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభమైన మెట్రోతో నగరం అభివృద్ధి రూపురేఖలు వేగంగా మారిపోవడంతో పాటు రవాణా వ్యవస్థ మెరుగవ్వడం, రియల్ వ్యాపారం పుంజుకోవడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గాయి. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి వాసులు, ఉద్యోగులు, ఐటీ సంస్థల వారు మెట్రో ప్రయాణంపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారికి సమయం కలిసిరావడం, సొంత వాహనాల వినియోగం తగ్గడంతో మేలు చేకూరింది.

ఇప్పుడు ఎల్‌ఆండ్‌టీ సంస్థ మెట్రో నిర్వాహణ నుంచి తప్పుకుని, మెట్రో పరుగులు ఆగితే ప్రయాణికులతో పాటు ఆధారిత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హైదరాబాద్ ప్రతిష్ట మసకబారడంతో పాటు రియల్ భూమ్ దెబ్బతినడం..కంపనీల వెనుకంజ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు విశ్లేసిస్తున్నారు. జనం కిక్కిరిసే బస్సుల్లో వెళ్లలేక మళ్లీ సొంత వాహనాల వైపు మొగ్గుచూపితే ట్రాఫిక్, కాలుష్యం కష్టాలు పెరుగనున్నాయి. ఎల్‌ఆండ్‌టీ తప్పుకుంటే మరో సంస్థ లేక ప్రభుత్వంమే మెట్రోను నిర్వహిస్తుందా లేదా అన్నది మునుముందు తేలాల్సివుంది.

Exit mobile version