Panchayat Elections | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్నారైలు పోటీ చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. వనపర్తి జిల్లాలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని కూడా సర్పంచ్ అయ్యేందుకు ఆరాటపడుతున్నారు. ఇలా రాజకీయాలపై తమకున్న ఆసక్తితో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తాజాగా ఓ ఎమ్మెల్యే భార్య కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగర పరిధిలోని కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచ్ పదవికి పోటీ చేశారు. మొహియుద్దీన్ స్వగ్రామం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్. ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుంచి నజ్మా సుల్తానా బస్వాపూర్‌లోనే బస చేస్తున్నారు. స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఇక నిన్న బస్వాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో హైదరాబాద్‌లోని గోల్కొండ, నానక్‌నగర్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా నజ్మా ప్రాతినిధ్యం వహించారు.
