మంత్రి కొండాకు షాకిచ్చిన.. ఎంపీ ఫలితం

సింహ్ గయా గడ్ మిలా అనే తీరుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరిస్థితి నెలకొంది. వరంగల్ లోక్ సభ ఎన్నికల ఫలితం మంత్రికి కక్కలేని మింగలేని స్థితిని కల్పించింది. తమ పార్టీ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్య భారీ మెజారిటీతో విజయం సాధించిందని సంతోషపడాలో? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధికి మెజారిటీ రావడం జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది

  • Publish Date - June 5, 2024 / 06:54 PM IST

తన నియోజకవర్గంలో కమల వికాసం
కాంగ్రెస్ కంటే బీజేపీకి 7వేల మెజారిటీ
తూర్పు మినహా అంతటా కాంగ్రెస్ ఆధిక్యత
ఎన్నికలను పట్టించుకోలేదనే అంతర్గత చర్చ

విధాత ప్రత్యేక ప్రతినిధి:

సింహ్ గయా గడ్ మిలా అనే తీరుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరిస్థితి నెలకొంది. వరంగల్ లోక్ సభ ఎన్నికల ఫలితం మంత్రికి కక్కలేని మింగలేని స్థితిని కల్పించింది. తమ పార్టీ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్య భారీ మెజారిటీతో విజయం సాధించిందని సంతోషపడాలో? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధికి మెజారిటీ రావడం జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మినహా అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ లభించింది. హోరాహోరిగా సాగిన పోరులో అక్కడి ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలు సాధించడమే కాకుండా పార్టీ పట్టు నిలిపి అభ్యర్ధిని గెలిపించి పార్టీ ప్రతిష్టను కాపాడారనే చర్చసాగుతోంది.

బీజేపీకి ఏడు వేలకు పైగా మెజారిటీ

మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉల్టా ఏడు వేల మెజారిటీ బీజేపీ అభ్యర్ధి అరూరి రమేష్ కు రావడం జీర్ణించుకోలేక పోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ తూర్పులో బీజేపీ అభ్యర్ధి అరూరి రమేష్ కు 74,142 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్యకు 67,066 ఓట్లు వచ్చాయి. బీఆరెస్ కు 20,360 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ కంటే బీజేపీకి సుమారు 7వేల కంటే ఎక్కువ ఓట్లు అదనంగా లభించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన కొండా సురేఖ 67,757 ఓట్లు సాధించింది. ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పై 15,652 ఓట్ల మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర కేబినేట్ లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 52,105 ఓట్లు, బీఆరెస్ కు 42,783 ఓట్లు వచ్చాయి. అయితే తాజా పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ ఓట్లు గణనీయంగా తగ్గినప్పటికీ కాంగ్రెస్ మెజార్టీ సాధించలేక పోవడం ఇబ్బందికరంగా మారింది. బీఆరెస్ ఓట్లు బీజేపీ వైపు క్రాస్ అయ్యాయని చెబుతున్నప్పటికీ మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం ఇది జరిగినా కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. పక్క నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేని కారణాలు ఒక్క తూర్పులోనే ఉన్నాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

అంటీముట్టనట్లున్నారనే విమర్శలు

మెదక్ పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్ పేరుతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్ధి విజయం గురించి పట్టించుకోలేదని, నామ మాత్రపు ప్రయత్నం మాత్రం చేశారనే విమర్శలున్నాయి. దీన్ని ప్రత్యర్ధి బీజేపీ ఉపయోగించుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాలతో పాటు స్వపక్షంలో సైతం కొండా సురేఖ అంటే గిట్టని వారికి మంచి ఆయుధాన్నిచ్చినట్లైందీ. సీఎం రేవంత్ వద్ద మంత్రికి ఇరకాటమైన పరిస్థితితో పాటు సమాధానం చెప్పుకోలేని సందర్భం ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. వాస్తవానికి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ గా ముందు మంత్రి కొండా సురేఖను నియమించారు. తర్వాత పార్టీ అభ్యర్ధిగా కడియం కావ్య తెరపైకి రావడంతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు.

ఇరుకున పడిన మంత్రి

సాకులు వెదుకుదామంటే పక్కన ఉన్న వరంగల్ పశ్చిమతో పాటు మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించడంతో సమాధానం చెప్పుకోలేని స్థితి ఏర్పడింది. ప్రభావాలు, కారణాలుంటే వరంగల్ పశ్చిమతో పాటు మిగిలిన స్థానాల్లో కూడా ఫలితం వేరుగా ఉండేదంటున్నారు.

Latest News