హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విధాత): టీ వర్క్ హైదరాబాద్‌లో రూపొందించిన స్విచ్ ఈకో సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ మొబైల్ వాహనాన్ని మంత్రి పొన్నం సోమవారం ప్రారంభించారు. ఈ వాహనాన్ని రూ. 67 లక్షల రూపాయలతో 18 స్టార్ట్‌అప్ కంపెనీలు కలిసి రూపొందించాయి. దీని ద్వారా పేపర్లు, పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ వేస్టేజ్, మెటల్ వ్యర్థాలు, తాగిపడేసిన సిగరెట్ ముక్కలు, శానిటరీ ప్యాడ్స్, టెక్స్‌టైల్ వర్థాలు, కంపోస్టబుల్ వ్యర్థాలను తీసుకుని వేరు వేరు యంత్రాల ద్వారా రీసైక్లింగ్ జరిపి తిరిగి వినియోగించుకునేలా చేస్తోంది. ఈ స్విచ్ ఈకో వాహనాన్ని ప్రరంభించిన అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సస్టైనబిలిటీ ఆన్ వీల్ కార్యక్రమం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆలోచననుంచి వచ్చినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి దానిని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరముందన్నారు. హుస్నాబాద్ ఇన్నోవేషన్ పార్క్ వెహికిల్ ద్వారా ప్లాస్టిక్ , పాలిథిన్, ఈ వెస్టేజెస్, శానిటరీ ప్యాడ్స్ తదితర వ్యర్థాలను తిరిగి వాడుకునేలా రీసైక్లింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మొదటి సారి మా హుస్నాబాద్ మున్సిపాలిటీ లో ప్రారంభించుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చి దిద్దాలి, ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ , గర్భ సంబధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. హుస్నాబాద్ లో ప్లాస్టిక్ వాడకుండా 284 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని తెలిపారు. 13 రకాల వస్తువులు 500,400,300 కిట్స్ అందించామని మంత్రి అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఫంక్షన్ ఉన్న ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ వాడేలా చర్యలు తీసుకుంటున్నామని, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 300 టీ స్టాల్ లకు స్టీల్ గ్లాసులు పంపిణీ చేశామన్నారు.
18 స్టార్టప్ కంపెనీ వాళ్లు సస్టైనబిలిటీ ఆన్ వీల్‌ను తయారు చేశారు, వారికి అభినందనలు అని మంత్రి వెల్లడించారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు మిమ్మల్ని తీసుకుపోయి ఇది ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని చేసిన ప్రజల సహకారం కావాలన్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం జరగాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి అందరూ కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వర్షాలు పడినప్పుడు ప్రతి చుక్క కాపాడుకునేలా వాటర్ హార్వెస్టింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బిల్డర్స్ నిర్మాణాలు జరిగేటప్పుడు కచ్చితంగా వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ నిర్మించాలని తెలిపారు. రోజుకు 547 మిలియన్ లీటర్ల నీటిని ప్రభుత్వం అందిస్తుంది, గోదావరి ,కృష్ణ , సింగూరు,మంజీరా నుండి నీరు ఇస్తుందన్నారు. వేసవికాలంలో ఇబ్బందులు వస్తున్నాయి గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట డీఆర్డీవో జయదేవ్ , స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేష్ బాబు, సస్టైనబిలిటీ ఆన్ వీల్ రూపకర్త అక్షయ్, టి వర్క్ ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ , రాజేష్ ,జిల్లా మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు రేణుక ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.