మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతి ఒక గ్రూపుకు వడ్డీ లేని రుణాలను రూ.5లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రతి మహిళా సంఘం తీసుకునే రూ. 10 లక్షల రూపాయల బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం 2500 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. మహిళల ఆర్థిక సాధికారతలో ఇదో మైలురాయి అని, లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అందుతుందన్నారు. గతంలో మహిళలకు పట్టుమని పదివేల రూపాయల లోన్లు కూడా లభించకపోయేవని, ఇప్పుడు ఆ మహిళలకి బ్యాంకులు లక్షలాది రూపాయలు ఇస్తున్నాయని చెప్పారు.
మహిళాభ్యున్నతితోనే అభివృద్ధి పరిపూర్ణం
మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా పనిచేస్తున్నామని.. మహిళాభ్యున్నతితోనే అభివృద్ది పరిపూర్ణం అవుతుందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో మా ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పంట కొనుగోలు కేంద్రాల్లో 40% కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామని, ఈ ఏడాది 26 వేల కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. పేదరికం వల్లే నేను నక్సలైట్లలో చేరానని, వడ్డీ వ్యాపారుల దోపిడి కారణంగా సామాన్యులు నష్టపోయారు అన్నారు. వారి బాధ చూడలేక నేను తుపాకి పట్టాను అని గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవంతోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి ఆర్థికాభివృద్దికి బాసటగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. బ్యాంకులకు మహిళా సంఘాలు రీ పే మెంట్ బాగా చేస్తున్నారని, నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు 100% బ్యాంకులకు రీపేమెంట్ చేయాలని సూచించారు. ఈ సందర్బంగా లోన్లు తీసుకోవడంలో, రీపేమెంట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన జిల్లా డీఆర్డిఓ లు జిల్లా డీఆర్డిఓలు, జిల్లా సమాఖ్య అధ్యక్షులను మంత్రి సీతక్క సన్మానించారు.
ఇవి కూడా చదవండి :
ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు సరళీకృతం చేయాలి: మండలి చైర్మన్ గుత్తా
విజయ్ కి గవర్నర్ మరోసారి షాక్… ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరణ.!
