Site icon vidhaatha

Minister Tummala Nageswara Rao | తరుగు లేదు.. తాలు లేదు.. మిల్లర్ల దోపిడీపై ఉక్కుపాదం

ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పంట సొమ్ము
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్‌: గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. ఐకేపీ సెంటర్లు పెంచామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్ అధికారిని నియమించి, ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామని చెప్పారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవని మంత్రి అన్నారు. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ చేశారని గుర్తు చేశారు.

ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో ప్రతి కింటాపై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని తెలిపారు. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు వేస్తున్నామని తెలిపారు. గతంలో 45 రోజులు పెట్టేదని, దీంతో రైతు ఎంతో వడ్డీ నష్టపోయే పరిస్థితి ఉండేదని అన్నారు. ఇప్పుడు 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతున్నదని, దీంతో రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవని చెప్పారు. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకపోవడంతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఫసల్ బీమా యోజన లేదని, ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేదని మంత్రి తుమ్మల అన్నారు. అయినప్పటికీ.. తమది రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తోందని చెప్పారు. ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా, ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి మూడు వేల కోట్లతో పంట భీమా పథకాన్ని వానాకాలం నుండి అమలు చేస్తున్నట్టు తెలిపారు. తడిచిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం సేకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కల్లాల్లో వరి కుప్పలమీద రైతులు గుండె పగిలి చనిపోయారని, కానీ తమది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారని చెప్పారు.

Exit mobile version