విధాత : కాంగ్రెస్‌లో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్న నాకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వల్ల ప్రాణహాని అనుమానం ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీఎం రేవంత్ వల్ల మాదిగలు 50 ఏళ్లు వెనక్కి వెళ్లారని మరోసారి విమర్శలు గుప్పించారు. డబ్బులకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి అంటే ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి అక్రమంగా కోట్లు సంపాదించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మోత్కుపల్లి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మాలలకంటే మెజార్టీగా 80లక్షల మంది జనాభా ఉన్న మాదిగలకు మూడు ఎస్సీ రిజర్వ్ పార్లమెంటు స్థానాల్లో మూడు మాలలకే కేటాయించి మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రేవంత్‌రెడ్డి దొర మాదిరిగా పాలన చేస్తున్నారని విమర్శించారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే ఉండి మాదిగలకు న్యాయం కోసం పోరాడుతానన్నారు.